ఏ క్రికెటర్ కు అయినా సరే ఆటపరంగా ప్రశంసలు ఉంటాయి. అదే టైంలో కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక 2018లో కేప్ టౌన్ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ‘బాల్ టాంపరింగ్’ చేయడం.. క్రికెట్ వర్గాల్లో అప్పట్లో పెద్ద రచ్చ అయింది. ఈ వివాదానికి కారణమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్ క్రాఫ్ట్ పై ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించారు. స్మిత్, వార్నర్ లకు అయితే జీవితాంతం కెప్టెన్ కాకుండా బ్యాన్ చేశారు. అయితే ఇటీవల కాలంలో వార్నర్ కు మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది. కానీ ఏకంగా ఆస్ట్రేలియా బోర్డుని విమర్శిస్తూ వార్నర్.. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా తెగ చర్చించుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాల్ టాంపరింగ్ గొడవ జరిగి నాలుగేళ్లకు పైనే అవుతుంది. గత కొంతకాలంగా ఆటగాడిగా కొనసాగుతున్న వార్నర్.. తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాపెద్దల్ని అభ్యర్థించాడు. కొన్నాళ్ల క్రితం సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. అయితే వార్నర్ పై ఉన్న బ్యాన్ ని ఎత్తేసే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత అంగీకరించలేదు. కానీ కెప్టెన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడిని భర్తీ చేసే ఆటగాడు కనిపించడం లేదు. ఈ టైంలో వార్నర్ పై తిరిగి కెప్టెన్ అవుతాడనే మాట వినిపించింది. అందుకు తగ్గట్లే కోడ్ ఆఫ్ కండక్ట్ లో కొన్ని మార్పులు చేసిన ఆస్ట్రేలియా.. తన నిషేధంపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని వార్నర్ కు కల్పించింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై వార్నర్ సీరియస్ అయ్యాడు. ఇన్ స్టాలో చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు.
‘క్రికెట్ కంటే నాకు ఫ్యామిలీనే ముఖ్యం. గత ఐదేళ్ల నుంచి ఎన్నో అవమానాలను ఫేస్ చేశాను. ఆ టైంలో నా భార్యతోపాటు ముగ్గురు పిల్లలే అండగా నిలబడ్డారు. వాళ్లే నా ప్రపంచం. కేప్ టౌన్ టెస్టు తర్వాత నా కెప్టెన్సీపై పూర్తి నిషేధం విధించారు. ఆ తర్వాత నా ఆటని చాలా మార్చుకున్నాను. చాలా బాధ్యతగా ఉంటూ వచ్చాను. ఆ ఇష్యూ, నా కుటుంబంపై చాలా ఎఫెక్ట్ చూపించింది. ఇప్పటివరకైతే ఎలాంటి రిలీఫ్ లభించలేదు. ఇక రివ్యూ ప్యానెల్ ముందు నా గోడు వినిపించుకోవడానికి సరైన అవకాశం దొరుకుతుందని భావించాను. కానీ అది నాతో పాటు నా కుటుంబానికి ప్రాబ్లమ్ లా తయారైంది. దురదృష్టవశాత్తూ రివ్యూ ప్యానెల్, క్రికెట్ ఆస్ట్రేలియా నా లాయర్ సమర్పించిన దానిపై వ్యతిరేకంగా వ్యవహరించింది. అలానే నాపై పబ్లిక్ ట్రయల్ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో నా కుటుంబం మళ్లీ ఇబ్బంది పడటం ఏ మాత్రం ఇష్టం లేదు. మరోసారి నన్ను, నా కుటుంబాన్ని మరింత అవమానానికి గురిచేయాలని రివ్యూ ప్యానెల్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే కెప్టెన్సీ బ్యాన్ ఎత్తేవేయాలనే బిడ్ ని ఉపసంహరించుకుంటున్నాను’ అని వార్నర్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.