ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పేరు చెప్పగానే ఒకప్పుడు స్లెడ్జింగ్ మాత్రమే గుర్తొచ్చేది. గ్రౌండ్ లో అలా చెలరేగిపోయేవారు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ లో గెలుపోటములు తప్పించి మిగిలిన వాటి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఐపీఎల్ పుణ్యమా అని ఆటగాళ్ల మధ్య సంతోషకర వాతావరణం ఏర్పడింది. ఇక డేవిడ్ వార్నర్ గురించి ఎంత చెప్పుకొన్నా సరే తక్కువే. పేరుకే ఆసీస్ క్రికెటర్ గానీ.. మనలో ఒకడిలా కలిసిపోయాడు. కానీ ఓ విషయం మాత్రం వార్నర్ ని ఇప్పుడు బాధపెడుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే అందరికీ టిక్ టాక్ వీడియోలే గుర్తొస్తాయి. ఎందుకంటే గత రెండేళ్ల కాలంలో బ్యాట్ తో కంటే డ్యాన్సులతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. అలాంటి వార్నర్ పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా కోపంగానే ఉంది. దానికి కారణం 2018లో జరిగిన శాండ్ పేపర్ వివాదం. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో భాగంగా బంతిని శాండ్ పేపర్ తో రుద్దడం అప్పట్లో పెద్ద వివాదమైంది. వార్నర్, స్మిత్ తోపాటు మరో క్రికెటర్ పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అలానే స్మిత్, వార్నర్.. కెప్టెన్ కాకుండా బ్యాన్ చేశారు.
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆసీస్ కెప్టెన్ గా ఉన్న స్టీవ్ స్మిత్ పై ఆ దేశ బోర్డు నిషేధం ఎత్తేసింది. దీంతో ఈ ఏడాది యాషెస్ సిరీస్ లో ఓ టెస్టుకి స్మిత్ కెప్టెన్ గా చేశాడు. అదే టైంలో వార్నర్ పై పడిన లైఫ్ టైం బ్యాన్ మాత్రం తీసివేయలేదు. తనపై లైఫ్ టైమ్ నిషేధాన్ని ఎత్తేయాలని ఇప్పటికే ఓసారి వార్నర్… బోర్డుకు విన్నవించాడు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం దీన్ని ఆలస్యం చేస్తూ వస్తోంది. అదే టైంలో ఫించ్ తర్వాత వన్డేలకు కెప్టెన్ గా కమిన్స్ ని నియమించింది. దీంతో వార్నర్, ఆసీస్ బోర్డు తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
‘నేనేం క్రిమినల్ ని కాదు. ఏదో ఓ స్టేజీ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ అప్పీలు చేసుకునే అవకాశం ఉండాలి. కొంతకాలం పాటు బ్యాన్ వేస్తే తప్పులేదు. కానీ జీవితాంతం కెప్టెన్సీ చేయకూడదని అనడం మాత్రం చాలా కఠినమైన నిర్ణయం. చాలా రోజులుగా బ్యాన్ తీసేస్తారని వెయిట్ చేస్తున్నాను. ఈ ఫిబ్రవరిలో బ్యాన్ ఎత్తేస్తారని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇది నాతోపాటు కుటుంబానికి కూడా కష్టంగా ఉంది. ఏం జరిగిందో మళ్లీ చెప్పాల్సిన పనిలేదు. ఫించ్ తర్వాత నాకు కెప్టెన్సీ ఇస్తారని అనుకున్నా. కానీ అలా జరగలేదు. నాలుగేళ్ల క్రితం జరిగినదాన్ని సాకుగా చూపి.. ఇప్పుడు కెప్టెన్సీకి అర్హుడు కాదని చెప్పడం కరెక్ట్ కాదు.’ అని తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.