మాతృత్వం అనేది మహిళకు లభించిన గొప్ప వరంగా భావిస్తారు. ఎందుకంటే.. స్త్రీ మాత్రమే మరో జీవికి జన్మనివ్వగలదు. అలాంటి గొప్ప వరం కేవలం మహిళకు మాత్రమే ఉంది. ప్రతి స్త్రీ అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంది. ఇక గర్భం దాల్చింది అని తెలియగానే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు భర్తలు, అత్తింటి వాళ్లు, అటు పుట్టింటి వాళ్లు కూడా కోడలు, కుమార్తె గర్భవతి అయ్యిందని తెలిసిన మరుక్షణం నుంచే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కాలు కింద పెట్టనివ్వరు. అయితే నేటి కాలంలో పెళ్లి, పిల్లలు వంటి వాటిని మహిళలు కెరీర్‌కు అడ్డు అని భావించడం లేదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గర్భం దాల్చిన తర్వాత కూడా.. డెలివరీ ముందు వరకు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. క్రీడాకారులు కూడా ఇందుకు మినాహాయింపు కాదు అంటున్నారు ద్రోణవల్లి హారిక. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనడమే కాక.. కాంస్యం గెలిచి.. ప్రశంసలు అందుకుంటుంది. ఆ వివరాలు…
తాజాగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఏ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు కావడం విశేషం. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక… ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. కానీ ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా సంతోషంగా ఉంది. ‘18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడాను. ఇది నాకు 9వ ఒలింపియాడ్. దేశం తరఫున పతకం సాధించి పోడియంపై నిలవాలని ఎన్నో సార్లు కలలు కన్నాను. ఇప్పుడు ఇది సాధ్యమైంది’’ అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాక..‘‘ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇలాంటి విజయం దక్కడం చాలా సంతోషాన్నే ఇవ్వడమే కాక మరపురాని మధురానుభూతిగా మిగిలింది. భారత్‌లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. అప్పటినుంచి చెస్ చుట్టే నా ప్రపంచం తిరిగింది. ప్రతీ అడుగులో ఆటపైనే దృష్టి పెట్టాను. అందులో భాగంగా పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్లాంటి సెలబ్రేషన్స్ అన్నింటికి దూరంగా ఉన్నాను. ఏదైనా పతకం గెలిచిన తర్వాతే అనుకున్నా. బాగా ఆడేందుకు ప్రతీ రోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు కోసం ఎంతో ఎదురు చూశా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పతకం లభించింది’ అంటూ హారిక తన సంతోషాన్ని తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యింది. మరి హారిక సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.