జిడ్డు బ్యాటింగ్ అంటే ఏంటో రుచి చూపించాడో ప్లేయర్. ఏకంగా 400 నిమిషాల పాటు క్రీజులోనే ఉండి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..!
క్రికెట్లో అవసరాన్ని బట్టి హిట్టింగే కాకుండా డిఫెన్స్ కూడా చేయాల్సి వస్తుంది. వికెట్లు పడినప్పుడు ఎక్కువగా ప్లేయర్లు డిఫెన్స్ టెక్నిక్‌నే ఉపయోగిస్తారు. దీనికి భిన్నంగా కొందరు అటాకింగ్ గేమ్ కూడా ఆడతారు. అయితే చాలా మటుకు బ్యాటర్లు సేఫ్‌గా ఆడటానికే మక్కువ చూపుతారు. సంప్రదాయ క్రికెట్‌గా పిలిచే టెస్టుల్లో అయితే డిఫెన్స్ ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు. టెస్టుల్లో కొన్ని సమయాల్లో ప్రత్యర్థి చేతిలో ఓటమి తప్పించుకునేందుకు ప్లేయర్లు జిడ్డు బ్యాటింగ్ చేస్తారు. ఎలాగైనా మ్యాచ్‌ను డ్రా చేయాలని చూస్తారు. జిడ్డు బ్యాటింగ్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పుజారానే. వీళ్లు మ్యాచ్ పరిస్థితులను బట్టి గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోగలరు. వీళ్లను ఔట్ చేయలేక బౌలర్లు తలపై చేతులేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ద్రవిడ్, పుజారాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లున్నాడు ఆష్లే చంద్రసింఘే.
విక్టోరియా జట్టు ఆటగాడైన చంద్రసింఘే షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో జిడ్డు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న షీల్డ్ 2022-23 ఫైనల్లో ఆష్లే చంద్రసింఘే 403 నిమిషాలు క్రీజులో పాతుకుపోయాడు. 280 బాల్స్‌ను ఎదుర్కొని 46 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విక్టోరియా 195 రన్స్‌కు ఆలౌట్ అయింది. అయితే ఓపెనర్‌గా దిగిన చంద్రసింఘే మాత్రం ఆఖరి వరకు క్రీజులో అజేయంగా నిలబడి ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. షీల్డ్ ఫైనల్లో కనీసం 250 బాల్స్‌ను ఎదుర్కొని చివరి వరకు క్రీజులో అజేయంగా నిలబడిన రెండో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు చంద్రసింఘే. ఇతడికి ముందు 1997-98 సీజన్ ఫైనల్లో టాస్మానియా ప్లేయర్ జేమీ కాక్స్ 267 బాల్స్‌లో 115 రన్స్‌తో అజేయంగా క్రీజులో నిలిచాడు.
ఈ రికార్డుతో పాటు ఆష్లే చంద్రసింఘే మరిన్ని రికార్డులు కూడా నమోదు చేశాడు. షీల్డ్ టోర్నీ హిస్టరీలో 46 రన్స్ చేసేందుకు అత్యధిక బాల్స్‌ను ఎదుర్కొన్న ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండా షీల్డ్ ఫైనల్లో ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడిన ఓపెనర్‌గానూ చంద్రసింఘే రికార్డు నెలకొల్పాడు. 16.43 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు.. ఫస్ట్ రన్ చేసేందుకు ఏకంగా 49 బాల్స్ తీసుకోవడం కూడా ఓ రికార్డే. కాగా, చంద్రసింఘే జిడ్డు బ్యాటింగ్‌ను కొందరు నెటిజన్స్ విమర్శిస్తుంటే, మరికొందరేమో అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. చంద్రసింఘే ఓపికగా క్రీజ్‌లో నిలబడిన విధానాన్ని టెస్ట్ క్రికెట్ లవర్స్ మెచ్చుకుంటున్నారు. శ్రీలంక మూలాలు కలిగిన చంద్రసింఘే.. కుమార సంగక్కర, మైక్ హస్సీలను ఆదర్శంగా తీసుకుని క్రికెట్ ఆడటం ఆరంభించాడు.