ఆఫ్గనిస్థాన్ లో పరిస్థితితులు చూస్తుంటే ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందో అని ప్రపంచం మొత్తం ఆందోళనగా ఉంది. అవేం పట్టకుండా క్రికెట్ మ్యాచ్ లు ఆడాలని ఉవిళ్లూరిన పాకిస్తాన్ కు చివరికి బంగపాటే ఎదురైంది. సెప్టెంబర్ 3 నుంచి శ్రీలంకలో పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్ మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
ఆఫ్గనిస్థాన్ ని తాలిబన్లు వశం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు అన్నీ తారుమారయ్యాయి. జనజీవనం స్తంభించింది. అందరూ ఆ దేశాన్ని వదిలి వెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని దేశాలు వారి పౌరులను వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోని పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ గురించి ఆఫ్గనిస్తాన్ బోర్డుతో వర్చువల్ గా సమావేశమైంది. మొదట మూడు వన్డేల సిరీస్ కు అంగీకరించిన ఆఫ్గన్ బోర్డు చివర్లో వారి నిర్ణయాన్ని మార్చుకుంది. సిరీస్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు కుండ బద్దలు కొట్టేసింది. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బోర్డు సీఈవో హమీద్ షిన్వారి తెలిపారు. తర్వాత ఈ విషయంపై స్పందించిన పాక్ బోర్డు ప్రస్తుతం ఆఫ్గన్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదాకి అంగీకరించామని వెల్లడించారు.