తెలంగాణ కాషాయ పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతల ఆస్తులు రిలయన్స్ సంస్థ వేలం వేయనుంది. వారికున్న పలుకుబడితో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న ఈ ఇద్దరూ నేతలు తిరిగి చల్లించకపోగా.. నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో బ్యాంకు అధికారులకు మరోదారి లేకపోవడంతో ఆస్తులను వేలం వేసి.. వచ్చినదానితో సరిపెట్టుకోనున్నారు.
బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడం.. వాటిని ఎగ్గొట్టడం రాజకీయ నాయకులకు, బడా బడా వ్యాపారస్థులకు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు పాల్పడ్డ విజయ్ మాల్యా, నీరవ మోదీ, మోహుల్ చోక్సీ వంటి వారు దేశం వదిలి పారిపోగా.. రాజకీయ నాయకులు వారి వారి పలుకుబడితో సమాజంలో ఇంకా పెద్దమనుషులుగా చలామణి అవుతున్నారు. అయితే, అలాంటి వారందరికీ వెన్నులో వణుకుపుట్టించే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌కు కోట్ల రూపాయిలు రుణం ఎగ్గొట్టిన ఇద్దరు తెలంగాణ రాజకీయ నేతల ఆస్తులు వేలం వేయబోతున్నట్లు సమాచారం. ఆ నేతలు ఎవరు..? ఎన్ని కోట్ల రుణం ఎగ్గొట్టారు..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
రాణీ రుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డి వీరిద్దరూ తెలంగాణ రాజకీయాల్లో పేరు మోసిన బడా నేతలు. జర్నలిస్టుగా పేరుగాంచిన రాణీ రుద్రమ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయటం.. యువ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించి ఎన్నికల్లో కూడా పోటీచేయటం, ఆ తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయటం జరిగాయి. ఇక జిట్టా బాలకృష్ణారెడ్డి విషయానికొస్తే.. ఒకప్పుడు ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకొని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యమాన్ని ముందుండి నడిపిన నాయకుల్లో జిట్టా ఒక్కరు. ఓ దశలో ఆయనే భువనగిరి టీఆర్ఎస్ కాండిడేట్ అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఆయనకు టీఆర్ఎస్ కు దూరం పెరగడంతో గులాబీ పార్టీకి గుడ్ భై చెప్పి.. యువ తెలంగాణ పేరుతో పార్టీని పెట్టి ఎలాగోలా కొన్నాళ్లు నెట్టుకొచ్చారు. అనంతరం దానిని కాషాయ పార్టీలో కలిపేశారు.
ఇప్పుడు అసలు విషయమేమిటంటే.. ఈ ఇద్దరు నేతలు లక్ష్మీ విలాస్ బ్యాంక్ నుంచి రూ. 18 కోట్లకు పైగా లోన్ తీసుకొని తిరిగి చెల్లించలేదట. ఒకట్రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో బ్యాంకు అధికారులు వారి ఆస్తులను వేలం వేసేందుకు రంగంలోకి దిగారు. ఆస్తుల వేలం ప్రక్రియను లక్ష్మీ విలాస్ బ్యాంక్, రిలయన్స్ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. దీంతో రిలయన్స్ సంస్థ రాణీ రుద్రమ, జిట్టా ఆస్తులను వేలం వవేయనున్నట్లు ప్రకటన ఇచ్చింది. అయితే.. ఈ నోటీసులపై ఇద్దరు నేతలు స్పందించింది లేదు. పైగా ఈ లోన్ వ్యవహారం జరగ్గా దీని నుంచి తప్పించుకోవడానికే కాషాయ కండువా కప్పుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రుణాలు ఎగ్గొట్టిన రాజకీయ నేతలు ఆస్తులు వేలం వేయటం.. సరైన నిర్ణయమేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.