యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్ధం. కానీ.., నేటి సమాజంలో స్త్రీకి కనీసం గౌరవ మర్యాదలు అయినా లభిస్తున్నాయా అంటే లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్త్రీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. స్త్రీల కోసం సరికొత్త చట్టాలు అంటున్నారు. మహిళల రక్షణకి పెద్ద పీట అంటున్నారు. కానీ.., ఇన్ని మాటలు చెప్తున్న పోలీసులే మహిళలకి ఇబ్బంది కలిగిస్తుంటే ఇక వారి కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విశాఖలో ఓ యువతిపై నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేసినంత పని చేశారు పోలీసులు. విశాఖలోని అపోలో హాస్పిటల్ లో టైపిస్ట్గా పనిచేస్తున్నారు లక్ష్మీ అపర్ణ. ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తున్న ఆమె, సాయంత్రం కర్ఫ్యూ కారణంగా తన స్నేహితుడు బండిపై ఇంటికి వెళ్తుంది. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడో పట్టణ పోలీసులు ఆమె వెళ్తున్న వాహనానికి అపరాధరుసుం విధించారు. నా దగ్గర పాస్ ఉంది. అన్నీ రకాల పర్మిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు తన వాహనంపై ఎలా అపరాధరుసుం విధిస్తారని లక్ష్మీ అపర్ణ పోలీసులను నిలదీసింది. దీంతో.., ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు.
అది వీలుపడకపోవడంతో అపర్ణ సెల్ఫోన్ లాక్కొన్నారు. దీంతో ఆమె తిరగబడింది. పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. కానీ.., ఏ తప్పు చేయకుండా నేను ఎందుకు పోలీస్ స్టేషన్ కి రావాలని ప్రశ్నించింది. కానీ.., అక్కడే ఉన్న సీఐ అప్పారావు.. నువ్వు మద్యం తగినట్టు ఉన్నావు. నీకు మద్యం పరీక్షలు చేయాలనడంతో లక్ష్మీ అపర్ణ మరింత రెచ్చిపోయింది. మీరే మద్యం తాగారేమో! పని లేకుండా రోడ్డుపై తిరిగేవాళ్లను వదిలేసి.., మమ్మల్ని పట్టుకుంటారేంటి?’ అంటూ మండిపడింది. మిమల్ని ప్రశ్నించకుండా ప్రతిరోజూ జరిమానాలు కడుతూపోతే ఎలా జీవించాలి అంటూ అపర్ణ కన్నీరుమున్నీరయ్యారు. అప్పటికే అక్కడికి మీడియా చేరుకోవడంతో చేసేది లేక పోలీసులు వెనుతిరిగారు. తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులపై దేశ వ్యాప్తంగా ఆగ్రహపు జ్వాలలు వెల్లువెత్తాయి. కానీ.., ఇక్కడితో కూడా ఏపీ పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రాలేదు.
ఇప్పుడు లక్ష్మీ అపర్ణపై, ఆమె స్నేహితుడుపై పోలీసులు సెక్షన్ 352, 353ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తమ తప్పు లేదని చెప్పుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.., ప్రజల నుండి మాత్రం లక్ష్మీ అపర్ణకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 6 గంటలకు ఒక్కటే ఆడపిల్ల ఎలా ఇంటికి వెళ్ళలి? ఆమెని తీసుకునిపోవడానికి వచ్చిన స్నేహితుడి బండికి ఎందుకు రోజూ ఫైన్ వేయాలి? అప్పటికప్పుడు మహిళా కానిస్టేబుల్స్ పిలిచి స్టేషన్ కి తరలించాల్సినంత పెద్ద తప్పు ఆమె ఏమి చేసింది? డ్యూటీ ముగించుకుని వస్తున్న ఓ ఆడపిల్ల ఎలా మద్యం తాగి ఉంటుంది? ఆ మాత్రం పోలీసులోకి విచక్షణ లేదా అని సభ్య సమాజం అంతా లక్ష్మీ అపర్ణకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక మహిళల రక్షణ కోసమే ఉన్నామని చెప్పుకునే నాయకులు ఒక్కరు కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించకపోవడం విశేషం. మరి.., ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.