పీఎఫ్ ఖాతా గురుంచి సందేహాలా..? ఉద్యోగి మరణించాక పీఎఫ్ అమౌంట్ ఏమవుతుందో అన్న ప్రశ్న మీ మదిలో మెదులుతోందా..? అలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ‘ఈపీఎఫ్ఓ’ గురుంచి ‘పీఎఫ్ ఖాతా’ గురుంచి తప్పక తెలుసుంటుంది. ఉద్యోగి యొక్క నెలవారీ జీతంలో కొంత మొత్తాన్ని కట్ చేసి.. ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఈ మొత్తానికి ప్రతి ఏడాది వడ్డీ జమవుతుంది. అత్యవసర సమయాల్లో ఈ ఖాతా నుంచి పాక్షికంగా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఉద్యోగి ఏదేని అనారోగ్యం బారిన పడినప్పుడు, ఇంటి అవసరాలు వంటి అత్యవసర సందర్భాల్లో నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, అర్ధాంతరంగా ఉద్యోగి మరణిస్తే.. పీఎఫ్ అమౌంట్ ఏమవుతుంది..? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వారికోసమే ఈ వార్త.
ఉద్యోగులు వారి మరణం తర్వాత పీఎఫ్ డబ్బులు ఎవరికి వెళ్లాలనే అంశాన్ని ముందుగానే ఆలోచించుకోవాలి. అంటే.. మన తరువాత ఆ ప్రయోజనాలు ఎవరకి చెందాలన్న విషయమై నామినీ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు ఇచ్చిన నామినీ వివరాలను మార్చుకోవాలన్నా.. ఇదే విధానాన్ని అనుసరించాలి. నామినీ వివరాలను ఎన్ని సార్లైనా సవరించుకోవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ ద్వారా ఈ-నామినేషన్ సదుపాయం అందిస్తోంది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు రిటైర్మెంట్‌కి ముందు మరణిస్తే EDLI పథకం కింద PF ఖాతాలో మొత్తాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు.