ఫిల్మ్ డెస్క్- మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్గి రాజేస్తున్నాయి. సాధారణ ఎన్నికలను మించి ఇక్కడ రాజకీయం నడుస్తోంది. మా అధ్యక్ష్య పదవికి పోటీ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ఇలా చాలా మంది మా బరిలో ఉన్నారు. దీంతో మా ఎన్నికలు కాస్త తెలుగు సినీ పరిశ్రమలో హీట్ ను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహా రావు మా ఎన్నిక్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
స్వతంత్ర అభ్యర్ధిగా మా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు సీవీఎల్ నరసింహా రావు తెలిపారు. మా సభ్యుల సంక్షేమం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తామని ఆయన అన్నారు. తన ప్యానల్ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఇండస్ట్రీలో మా సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ఈయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఆయన కొంత మంది నటీనటులను కలిసి తనకు సపోర్ట్ చేయమని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపధ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైనదని, ధర్మమైందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నానని చెప్పారు. చిన్న కళాకారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సీవీఎల్ నరహింహా రావు అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని విజయశాంతి స్పష్టం చేశారు. మొత్తం మీద మా ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో అంతకంతకు ఉత్కంఠను రేపుతున్నాయి.