సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా అయింది. నటి కరాటే కల్యాణిని మా నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.
ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయటాన్ని నటి కరాటే కల్యాణి తప్పుబట్టిన సంగతి తెలిసిందే. హిందూ దేవుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ఆమె వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియా వ్యాప్తంగా చిన్న పాటి యుద్దానికి తెరతీశారు. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన సీనియర్ ఎన్టీఆర్‌ను కల్యాణి అవమానించిందంటూ ‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు.. కరాటే కల్యాణిపై సస్పెన్షన్ వేటు వేశారు. మాలో ఆమెకున్న సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈనెల 16న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువు లోపల కరాటే కల్యాణి వివరణ ఇవ్వకపోగా..
లీగల్ నోటీసు పంపడం.. ‘మా’ సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని సస్పెన్షన్ నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 23న జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో కరాటే కళ్యాణి ప్రవర్తనపై చర్చించి.. ‘మా’ బైలాస్‌లోని క్లాజ్ నంబర్ 8 ప్రకారం సస్పెన్షన్ అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. మా నుంచి తనను సస్పెండ్ చేయటంపై కరాటే కల్యాణి తాజాగా స్పందించారు. తనను మా నుంచి సస్పెండ్ చేయటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు గౌరవం ఉంది. నేను ఆయన అభిమానిని. నేను ఆయన్ని ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయటానికి నేను వ్యతిరేకం కాదు. శ్రీకృష్ణుడి రూపంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఉండకూడదని అన్నాను. మిగిలిన హీరోల అభిమానులు కూడా అలా విగ్రహాలు పెడితే ఎలా ఉంటుంది. మా నుంచి నన్ను సస్పెండ్ చేయటం బాధగా ఉంది. పరిశ్రమ కోసం చాలా సార్లు మాట్లాడాను. నాకు మంచి బహుమతి ఇచ్చారు’’ అని అన్నారు. మరి, కరాటే కల్యాణి స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.