మన దేశంలో ఎన్నో గొప్ప కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఎంతో మంది గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ.. ఇండియాలో ఎంత మంది అపర కుబేరులు ఉన్నా., రతన్ టాటా స్థానం మాత్రం ప్రత్యేకం. ఆయన సంపాదించే ప్రతి రూపాయిలో దేశం కోసం కొంత భాగం పక్కన పెడతారు. ఇక ఏడాది పాటు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో. ఈ ఛారిటీ కనుక లేకుంటే రతన్ టాటా.. అంబానీలను, ఆదానీలను ఎప్పుడో దాటిపోయేవారు. కానీ.., ఆయన ఏనాడు కాసుల లెక్క చూసుకోలేదు. కష్టాలో ఉన్న పేద వారిని ఆదుకోవాలన్న సంకల్పానికి మాత్రమే కట్టుబడ్డారు. ఇందుకే టాటా అంటే అందరికీ అంత గౌరవం. మరి ఇంత మందికి ఇన్ని చేసే టాటా సంస్థ తన ఉద్యోగుల సంక్షేమం కోసం ఎంతలా ఆలోచిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు రతన్ టాటా దేశానికి ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ -19 కారణంగా మరణించిన తన ఉద్యోగుల కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుంది టాటా స్టీల్. వారికి పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించింది.
దీని ప్రకారం టాటా స్టీల్ లో కరోనాతో మరణించిన ఉద్యోగి పూర్తి జీతం వారి కుటుంబ సభ్యులకు.. వారి పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల వరకు చెల్లించడం కొనసాగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. టాటా స్టీల్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. “టాటా స్టీల్ అత్యుత్తమ సామాజిక భద్రతా పథకాలు చాలా బలమైనవి. అవి ఉద్యోగుల కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయి. తద్వారా మరణించిన ఉద్యోగి 60 సంవత్సరాల వయస్సు వరకు డ్రా అయిన జీతం కుటుంబానికి చివరి వరకు లభిస్తుంది. వైద్య ప్రయోజనాలు మరియు గృహ సౌకర్యాలు ఇందుకు అదనం. ఉద్యోగి నామినీకి ఇవన్నీ దక్కుతాయి” అని సంచలన ప్రకటన చేసింది టాటా స్టీల్. ఇది మాత్రమే కాకుండా.., కంపెనీ ఉద్యోగి.. కోవిడ్ -19 కారణంగా మరణిస్తే వారి పిల్లల గ్రాడ్యుయేషన్ వరకు విద్యకు అయ్యే అన్నీ ఖర్చులను టాటా స్టీల్ భరిస్తుందని తెలిపింది. టాటా స్టీల్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మాత్రమే కాకుండా.., దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక భారతీయ సంస్థ చేసిన మొట్టమొదటిది సంచలన ప్రతిపాదనగా అభివర్ణిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.