త్రిసభ్య కమిటీ మొత్తం 109 మందిలో మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను ఎంపిక చేసింది. సీబీఐకి కొత్త డైరెక్టర్ గా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది. 1962 సెప్టెంబర్ 22న జన్మించిన జైశ్వాల్ – 1985 బ్యాచ్ ఐపీఎస్. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో అత్యంత కీలకమైన రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో కూడా జైశ్వాల్‌కు 9 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఏడాది జనవరిలో డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వచ్చారు. సీబీఐ డైరెక్టర్ పదవికి షార్ట్ లిస్టు చేసిన బిహార్ కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్‌చంద్ర, ఏపీ కేడర్ అధికారి వీఎస్‌కే కౌముదికంటే జైశ్వాలే అత్యంత సీనియర్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకానికే మొగ్గు చూపింది.
గతంలో ఆయన మహారాష్ట్ర డీజీపీగా, దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఎస్‌పీజీ, ముంబయి యాంటీ టెర్రరిజం స్క్వాడ్, మహారాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లోనూ సేవలందించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన తెల్గీ స్కామ్‌ను ఈయనే దర్యాప్తు చేశారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న గడ్చిరోలి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వివాదాస్పద ఎల్గార్ పరిషద్, బీమా కోరెగావ్ కుట్ర కేసులను కూడా సీబీఐకి అప్పగించకముందు ఈయనే పర్యవేక్షించారు.