టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోదరి మెగాఫోన్ పట్టనున్నారు. లైట్స్, కెమెరా, యాక్షన్ అనేందుకు ఆమె రెడీ అవుతున్నారు. అసలు కీర్తి సురేష్ సిస్టర్ ఏం తెరకెక్కించనున్నారంటే..!
తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల సంఖ్య తక్కువనే చెప్పాలి. ఆ లెక్కన చూసుకుంటే.. మొత్తం ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ లేడీ డైరెక్టర్ల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. సినిమాలపై ఆసక్తితో దర్శకులుగా ఎంట్రీ ఇచ్చినా ఒకట్రెండు మూవీస్‌తో ఫేడవుట్ అయిన ఫిమేల్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. చావోరేవో ఇక్కడే తేల్చుకుందాం అనుకొని, నిరంతరం తమను తాము మెరుగుపర్చుకుంటూ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్‌ను కొనసాగిస్తున్న మహిళా దర్శకుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ జాబితాను చూస్తే.. తెలుగులో నందినీ రెడ్డి, తమిళంలో సుధా కొంగర వంటి ఒకరిద్దరు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మాత్రమే కనిపిస్తారు. అయినా దర్శకులుగా ప్రయత్నిస్తున్న మహిళలు ఉన్నారు.
ఇటీవలే నేచురల్ స్టార్ నాని సోదరి గంటా దీప్తి ‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్‌తో డైరెక్టర్‌గా మారారు. అయితే ఆమె అంత బలమైన ముద్ర వేయలేకపోయారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఒక హీరోయిన్ సోదరి చేరనున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ అక్క రేవతి సురేష్ దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఆమె డైరెక్టర్‌గా మారుతోంది ఫీచర్ ఫిల్మ్‌తో కాదు.. ఒక షార్ట్ ఫిలింతో కావడం గమనార్హం. ఆమె తీస్తున్న ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ‘థ్యాంక్ యూ’. రేవతి డైరెక్ట్ చేస్తున్న షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కీర్తి సురేష్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఒక జంట టీ తాగుతూ కబుర్లు చెప్పుకునే క్రమంలో నడిచే స్టోరీలా అనిపిస్తోంది. ఇదో స్వీట్ షార్ట్ ఫిల్మ్ అని.. తన సోదరి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కీర్తి సురేష్ చెప్పారు.