సమాజంలో మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాల్సిన పోలీసులే కొన్నిసార్లు వ్యవస్థ సిగ్గుపడే పనులు చేస్తుంటారు. అలాంటి సంఘటనే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రక్షణ కల్పించాలని ఆశ్రయించిన ఓ వివాహిత పై సబ్ ఇన్స్పెక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో నిజం ఎక్కడ బయట పడుతుందోనని భయంతో అబార్షన్ కూడా చేయించాడు. ఈ విషయం పై సదరు మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ఎస్సైతో పాటు మరో 8 మంది పై కేసు నమోదైంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత (32) తన తొమ్మిదేళ్ల కూతురితో నివాసముంటుంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి రెండో భర్త కూడా వదిలేసి పోవడంతో న్యాయం కోరుతూ పళుగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఆ స్టేషన్ ఎస్సై అయినటువంటి సుందర లింగం (40) కేసు పేరుతో సదరు మహిళ పై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. చివరికి ఆ మహిళ గర్భం దాల్చిందని విషయం తెలుసుకొని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు అబార్షన్ చేయించాడు.
తనకు జరిగిన అమానుషం పై ఆ మహిళ వేరే పోలీస్ స్టేషన్లు, డీఎస్పీ , ఎస్పీ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎక్కడా న్యాయం జరగలేదు. చివరిగా బాధిత మహిళ న్యాయమూర్తిని ఆశ్రయించింది. విచారణ అనంతరం సుందర లింగంతో పాటు అబార్షన్ చేసిన డాక్టర్, మరో 7మంది పై కేసులు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం మార్తాండం పోలీసులు ఈ కేసును టేకప్ చేసారు.