నేషనల్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఈ పేరు తప్ప మరేం వినిపించడం లేదు. కరోనా పేరు వింటేనే అందరికి వెన్నులో వణుకు వచ్చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో భారత్ పై అంతగా ప్రభావం చూపని కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ లో మాత్రం విజృంభించేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సెకండ్ వేవ్ తరువాత మళ్లీ ధర్డ్ వేవ్ ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ కొత్త కొత్త వైరస్ లు దాడి చేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోననే కంగారు మొదలైంది. ఐతే ఫస్ట్ వేవ్ లో మన దేశంలో అంతగా ప్రభావం చూపని కరోనా.. సెకండ్ వేవ్ లో ఎందుకు ప్రభావం చూపుతోందన్నదానిపై అందరి ఆసక్తి నెలకొంది.
దీనికి గల కారణాలపై వైద్య నిపుణులు అన్వేషణ మొదలుపెట్టారు. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు పెరగడానికి గల కారణాలపై ఓ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కేవలం ప్రజల నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తేల్చారు నిపుణులు. దేశం మొత్తం కరోనా విలయ తాండవం చేస్తున్నాఇంకా 50 శాతం మంది మాస్క్ ధరించడం లేదని గుర్తించారు. అంటే భారత్ లో సుమారు 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 70 కోట్ల మంది మాస్కులు ధరించడం లేదని అధ్యయనంలో తేలిందట. అంతే కాదు మరో 64 శాతం మంది మాస్క్ సరైన పద్దతిలో ధరించడం లేదట.
చాలా మంది నోరును కవర్ చేస్తూ, ముక్కును సరైన విధంగా కవర్ చేయడం లేదని అధ్యయనంలో గుర్తించారు. భారత దేశంలో కేవలం 7 శాతం మంది మాత్రమే మాస్క్‌ను సరైన పద్దతిలో ధరిస్తున్నారని చేల్చారు. మరి కరోనా సోకకుండా రక్షించేంది కేవలం మాస్కు మాత్రమే. అలాంటిది మాస్కును అసలు ధరించకపోయినా, లేదా సరిగ్గా ధరించకున్నా అది కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇలా మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు కాబట్టే మన దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా జనంలో మార్పు వస్తుందని ఆశిద్దామా.