ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంతకంతకు ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ఆర్ఆర్ఆర్ 1920 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఫిక్షనల్ పీరియాడిక్ సినిమా.
తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌లు నటించారు. చరిత్రలో అస్సలు కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని స్నేహం చేస్తే, వారి బావోద్వేగాలను పరస్పరం పంచుకుని బ్రిటీష్ తెల్ల దొరలకు వ్యతిరేకంగా పోరాడితే ఎలా ఉంటుందనే కథాంశంతో ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. డివివి దానయ్య ఈ సినిమాను సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో నిర్మించారు.
అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటించారు. ఇప్పటి వరకు విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్, టీజర్, ప్రోమోలు అన్నీ సినిమాపై అంచనాలను రెండింతలు పెంచేశాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2022న విడుదల అవుతోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది రాజమౌళి టీమ్.
రీసెంట్‌గా ముంబైలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన ఆర్ఆర్ఆర్ యూనిట్, అదే క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఫిలమ్ నగర్ వర్గాల సమాచారం మేరకు, డిసెంబర్ 26న కేరళలోని ప్రధాన నగరం కొచ్చిన్‌లో, డిసెంబర్ 27న చెన్నై మహా నగరంలో, డిసెంబర్ 30న హైదరాబాద్‌లో, జనవరి 2 బెంగుళూరు సిటీలో ఆర్ఆర్ఆర్ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారట.
ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు మరో ఐదు ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం పది భాషల్లో విడుదలవుతుందన్నమాట.