మాస్ మాహారాజ రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బాస్టర్ సినిమా విక్రమార్కుడు. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. రవితేజ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఎమోషన్, యాక్షన్, కామెడీ దట్టించిన ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇచ్చిన సినిమా విక్రమార్కుడు. ఆ సినిమా రచయిత, రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు 2 కథను సిద్ధ చేసినట్లు సమాచారం. 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన విక్రమార్కుడు కథ అంటే విజయేంద్రప్రసాద్‌కు చాలా ఇష్టం. ఇప్పటి వరకూ ఆయన ఏ సినిమాకు సిక్వెల్ కథ రాయలేదు. బహుబలి కథను రెండు భాగాలుగా తీశారు తప్ప సిక్వెల్ కాదు.
అలాంటి విక్రమార్కుడు సినిమాకు ఆయన సిక్వెల్ కథ రాశారంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఈ సిక్వెల్ లో ఓ ట్విస్ట్ ఉంది. విక్రమార్కుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి విక్రమార్కుడు 2 సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు. ప్రస్తుతం రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తీస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా కమిట్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన ప్లాన్స్ ఏంటో ఎవరికీ తెలియదు. రాజమౌళి సినిమా అంటేనే ఏళ్లకు ఏళ్లు చిత్రీకరణ. అలాంటిది ఆర్‌ఆర్‌ఆర్ విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతుంది.
అది రిలీజ్ అయి. మహేష్‌బాబు సినిమా చేసి అప్పుడు ఖాళీ ఉంటే తప్ప విక్రమార్కుడు సిక్వెల్ పట్టాలెక్కె అవకాశాలు కనిపించడం లేదు. ఆ సమయానికి రవితేజ వేరే సినిమాతో బిజీగా ఉంటే విక్రమార్కుడు 2 కష్టమే. ఇన్ని ప్రతిబంధాల మధ్య విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు 2 కథకు దృశ్యరూపం లభించేందుకు ఒక మార్గం ఉన్నట్లు కనిపిస్తుంది. విజయేంద్రప్రసాద్‌కు పాన్ ఇండియా రైటర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఆయన కథ ఇస్తే దర్శకత్వం వహించేందుకు ఎందరో దర్శకులు క్యూలో నిల్చుంటారు. అలాంటి డిమాండ్ ఉన్న రైటర్ ఆయనకు బాగా నచ్చిన కథకు సిక్వెల్ రాసుకుని దాన్ని అలానే మూలన పెట్టరు. రాజమౌళికి ఉన్న కమిట్‌మెంట్స్‌ను అర్థం చేసుకుని, విక్రమార్కుడు 2 కథను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌తో తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
పూరినే ఎందుకు..?
తన కొడుకు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డైరెక్టర్ ఇప్పటి వరకు విజయం తప్ప అపజయం ఎరుగని దర్శకుడు, తెలుగు సినిమా పరిధిని పెంచిన ధీరుడు అయిన కూడా విజయేంద్రప్రసాద్‌కు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ను అభిమానిస్తారు. ఆయన ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పూరీ జగన్నాథ్ ఫోటోను పెట్టుకుంటారంటేనే తెలుస్తుంది. పూరీ అంటే విజయేంద్రప్రసాద్‌కు ఎంత ఇష్టమో. అలాంటిది పూరీతో ఆయన సిద్ధచేసుకున్న విక్రమార్కుడు 2 సినిమాను చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఈ గాసిప్‌ను బలపరిచేందుకు ఇంకో కారణం కూడా ఉంది.
పూరీ జగన్నాథ్, రవితేజకి మంచి ర్యాపో ఉంది. వీళ్లిదరి కాంబినేషన్లో 5 సినిమాలు వచ్చాయి. అందులో 3 హిట్లు.. వారిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. అలా విజయేంద్రప్రసాద్‌కు ఇష్టమైన దర్శకుడు, హీరోకు కనెక్షన్ కుదరడంతో విక్రమార్కుడు 2 పూరి డైరెక్షన్‌లో రూపొందనుందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. చూడాలి అదే నిజమైతే మరో అద్భుతమైన సినిమా ప్రేక్షకులను అలరించనుంది.