రాజస్థాన్- ఆమెకు ఏంకష్టం వచ్చిందో మరి. తాను బస చేస్తున్న హోటల్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్ హోటల్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
గుంగున్ ఉపాధ్యాయ్ అనే మహిళ ఫ్యాషన్ మోడల్ గా పనిచేస్తోంది. ఈమె జోధ్‌పూర్ నగరంలో నివాసిస్తోంది. ఆదివారం సాయంత్రం గుంగున్ ఉదయపూర్ నుంచి జోధ్‌పూర్‌కు తిరిగి వచ్చింది. రాత్రి ఆమె జోధ్‌పూర్ లోని రతనాడ ప్రాంతంలోని హోటల్ లార్డ్స్ ఇన్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకింది.
హోటల్ టెర్రస్‌పై నుంచి దూకడానికి ముందు గుంగున్ తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే గుంగున్ తండ్రి గణేష్ ఉపాధ్యాయ్ పోలీసులకు సమాచారం అందించి హోటల్ వద్దకు వచ్చాడు. తండ్రి, పోలీసులు వచ్చేలోపే గుంగున్ హోటల్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది.
గుంగున్ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మోడల్ గుంగున్ కాళ్లు, ఛాతీ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఎక్కువ మొత్తంలో రక్తం కోల్పోవడంతో వైద్యులు ఆమెకు నిరంతరంగా రక్తం ఎక్కిస్తున్నారు. మోడల్ గుంగున్ స్పృహలోకి వస్తే గాని ఆత్మహత్య ప్రయత్నానికి కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.