హైదరాబాద్- కరోనా మహమ్మారి సెంకడ్ వేవ్ తో వదిలిపోతుందని అంతా బావించారు. ధర్డ్ వేవ్ వస్తుందన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపించాయి. మూడో దశ కరోనా వస్తుందని కొందరు, రాదని మరి కొందరు నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో కరోనా కొత్త వేరియంట్ వచ్చి మరోసారి ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది.
అవును కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ మెల్ల మెల్లగా వాపిస్తోంది. నవంబర్ లో దక్షిణాఫ్రికా దేశంలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. సైలెంట్ గా అన్ని దేశాలకు పాకుతోంది. మన దేశంలోను ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, రాష్ట్రాలను పలు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో అంతకంతకు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో శనివారం కొత్తగా 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారిలో 9 మంది విదేశీయుల ఉండగా, భారత్ కు చెందిన ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
కెన్యా నుంచి వచ్చిన ఆరుగురు, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరికి, ఘన నుంచి వచ్చిన ఒకరికి, టాంజానియా నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన ప్రాంతాలపై తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ద పెట్టింది. వీరి వల్ల ఇంకా ఎవరికైనా ఒమిక్రాన్ సోకిందా అన్న దిశగా అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.