అమరావతి- ఉద్యోగం.. చదువును పూర్తి చేసిన ప్రతి ఒక్కరి కల. మంచి ఉద్యోగం చేయాలని, లైఫ్ లో సెటిల్ కావాలని అందిరికి ఆశ. ఇక ప్రభుత్వం ఉద్యోగం చేయాలనేది చాలా మంది కోరిక. ఐతే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత కాంపిటీషన్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోటీ పరీక్షలు రాయాలి, అందరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్వూకు హాజరై నెగ్గుకు రావాలి. ఇలా చాలా తతంగం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగానికి. పరీక్షలు ఏమో గాని ఇంటర్వూ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వూను నెగ్గుకు రావాలంటే అంత ఆశామాషి కాదు.
ఇదిగో ఇటువంటి సమయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రూప్ వన్ సహా అన్ని ఉద్యోగాలకు సంబందించిన పరీక్షల ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవంటూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో ఇక నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించమని, పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని శశిభూషణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
ఇంటర్వ్యూలు లేకుండా ఎపీపీఎస్సీ గ్రూప్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారనే అంశంలో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం వెల్లడించకపోవడంతో ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉండబోతోందోనని నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. ఉద్యోగ భర్తీకి సంబందించిన పోటీ పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు జరపవచ్చని నిపుణులు అంటున్నారు. ఇంటర్వూలలో అంతగా పారదర్శకత ఉండటం లేదన్న ఆరోపణల నేపధ్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.