కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబైకి టేకాఫ్ అయిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి ఎమర్జెన్సీ వచ్చింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఓ కేంద్ర మంత్రి తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. మంత్రి అయినా తన వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదని.. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడారని ప్రశంసల జల్లు కురిపించారు.
వివరాల్లోకి వెళితే.. గత రాత్రి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయల్దేరారు. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి తల తిప్పినట్టు అయ్యింది. తీవ్ర నీరసం.. ఒక్కసారిగా ఒంట్లోని శక్తినంతా ఎవ్వరో లాగేసినట్టుగా నిస్సత్తువగా అనిపించడం.. బీపీ లెవల్స్ కూడా తగ్గాయి. దీన్ని ఫ్లైట్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు. ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని వెతికారు. సిబ్బంది అడగ్గానే డాక్టర్ అయిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ తానున్నానని సమాధానం ఇచ్చారు.
ప్రథమ చికిత్స మొదలుపెట్టిన కేంద్ర మంత్రి సదరు ప్రయాణికుడికి కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించిన ఆ వ్యక్తి ఆరోగ్యం కొంత కుదుటపడినట్టు తోటి ప్రయాణికుడు ఒకరు చెప్పారు. తర్వాత గ్లూకోజ్ అందించడంతో సదరు ప్రయాణికుడు త్వరగా కోలుకున్నాడు. దీంతో ఇండిగో యాజమాన్యం కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్‌పై ప్రశంసలు కురిపించారు.
A doctor at heart, always!
Great gesture by my colleague @DrBhagwatKarad. https://t.co/VJIr5WajMH
— Narendra Modi (@narendramodi) November 16, 2021