భూమి మీద మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం ప్రధానమైనవి అని అందరికి తెలుసు. కానీ వాటితో పాటు ధనం కూడా మనిషి జీవించడానికి చాలా అవసరం. చాలా మంది పోయేటప్పుడు వెంట ఏమైనా తీసుకెళ్తామా? అని మాట్లాడుతారు. పోయిన తరువాత సంగతి దేవుడికి ఎరుక.. బతికి ఉన్నప్పుడు దారుణంగా జీవితం అనుభవించ కూడదు అంటే ధనం మాత్రం చాలా అవసరం. నేటికాలంలో ప్రతి పని డబ్బుతో సాధ్యం అవుతోంది. ఇంకా చెప్పాలంటే మన అంతిమయాత్ర కూడా ఇబ్బందులు లేకుండా జరగాలంటే డబ్బులు ఉండాలి. ఎంతో మంది ఆస్పత్రుల నుంచి తమ వారి శవాన్ని ఇళ్లకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేక అక్కడే వదిలేసి వెళ్తున్నారు. కొందరు బైక్ లు, సైకిల్ పై తమ వారి మృతదేహాలను తీసుకెళ్తున్నారు. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు మనం చాలా చూశాం. తాజాగా వీటన్నింటికి మించిన దృశ్యం ఒకటి జరిగింది. తన జీవన సహచరి అంతిమయాత్రకు చేతిలో చిల్లిగవ్వ లేక చివరికి ప్లాస్టిక్ సంచిలో ఆమె మృతదేహాన్ని చుట్టుకుని తీసుకెళ్లాడు. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా మళవల్లికి చెందిన కాళమ్మ(26), రవి(28) భార్యాభర్తలు. ఈ దంపతులు స్థానికంగా చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు. అలా పలు చోట్లు చిన్న గుడెసెలను ఏర్పాటు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు. యళందూరు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం సమీపంలో ఉన్న బెల్లం తయారీ కేంద్ర వద్ద గత పదిహేను రోజులుగా వారు ఉంటున్నారు. కొన్నిరోజుల నుంచి కాళమ్మ అనారోగ్యంతో బాధ పడుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి కాళమ్మ చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు రవి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. తన భార్య మృతదేహాన్ని శ్మశానవాటిక వరకు ఎలా తరలించాలో రవి అర్ధం కాలేదు. పుట్టెడు దుఃఖంతో ఉన్న రవి..తన భార్య శవాన్ని ప్లాస్టిక్ గోనె సంచిలో ఉంచాడు.
అనంతరం ఆ మృతదేహాన్ని భుజంపై వేసుకుని శ్మశానవాటికకు బయలుదేరాడు. ఈక్రమంలో కాళమ్మ మృతదేహాన్ని రవి భుజం వేసుకుని తీసుకెళ్లడం స్థానికులు గుర్తించారు. అతడిని అడ్డుకుని ఏమైంది? అంటూ ప్రశ్నించారు. అతడు జరిగిన విషయం వారికి చెప్పడంతో వారు కూడా ఎంతో వేదన చెందారు. అలానే ఈ సమాచారన్ని పోలీసులకు కూడా అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రవి నుంచి వివరాలు సేకరించారు. పంచనామాకు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో తీసుకెళ్తుండటం చూపరులను కంట తడిపెట్టిచింది.