రోజు రోజూకు ప్రపంచ వ్యాప్తంగా జనాభా బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలు జనాభా నియంత్రణపై చర్యలు తీసుకుంటుంటే, మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదల కోసం ఆఫర్లు ఇస్తున్నాయి. మన దేశం కూడా జనాభా పెరుగుదల బాగానే ఉంది. ఇప్పటికే మనదేశ జనాభా 140 కోట్లు దాటింది. దీంతో జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ ప్రకటనలు చేస్తుంది. అలానే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పలు రకాల వాటికి అనర్హులు ప్రకటించింది. ఇలా కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ విషయంలో ముందుకు వెళ్తుంటే.. ఇందుకు భిన్నంగా సిక్కిం రాష్ట్రం కొత్త ఆఫర్ ప్రకటించింది. పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్ ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం బంపర్ ఆఫర్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సిక్కింలో మాఘే సంక్రాంతి పండగను.. అక్కడి ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అలానే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడ వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించింది. అలా జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. వారి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఇంకా మాట్లాడుతూ.. సిక్కింలో తమ జాతి జనాభాను బాగా పెంచాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం భరోసా కల్పించారు. మూడో పిల్లవాడ్ని కంటే ఇంక్రిమెంట్ రెట్టింపు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధంగా చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ మహిళ ఉద్యోగులు ఎక్కువ మంది పిల్లలకి జన్మనిస్తారో.. వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్ ఇంక్రిమెంట్ తో పాటు జీతంలో కోతలు లేకుండా సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని హామి ఇచ్చారు. ఇటీవల కాలంలో సిక్కింలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పడిపోయిందన్నారు. అందుకే తమ జాతి జనాభాను పెంచడానికి ఈ హామిలు ఇస్తున్నట్లు తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు సిద్ధమయ్యే మహిళలకు.. అందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు.
ఇప్పటికి వరకు ఈ పద్ధతి ద్వారా 38 మంది మహిళలు గర్భం దాల్చారని, అలానే మరికొందరు తల్లులు కూడా అయ్యారని సీఎం తెలిపారు. అలానే సర్వీసులో ఉన్న మహిళా ఉద్యోగులకు ఏడాది పాటు ప్రసూతీ సెలవులు ఇస్తున్నామని, మగ ఉద్యోగులకు అయితే 30 రోజుల పితృత్వ సెలవు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. సీఎం ఇచ్చిన వరాల జల్లులపై ఆ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి.. జనాభా పెరుగుదల కోసం సీఎం ఇలాంటి ప్రకటనలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.