దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైళ్లను చెప్పొచ్చు. మారుమూల ప్రాంతాలకు కూడా భారతీయ రైల్వే కనెక్టివిటీ విస్తరించింది. అంతర్రాష్ట్ర రైల్వే నెట్వర్క్ వల్ల ప్రజలు సుదూర ప్రాంతాలకు సులువుగా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ నెట్వర్క్, కనెక్టివిటీ ఉన్నా.. దేశంలో రైల్వే స్టేషన్ లేని ఓ రాష్ట్రం ఉండటం గమనార్హం.
మన దేశంలో ప్రయాణ సర్వీసుల్లో అత్యంత ముఖ్యమైనదిగా రైళ్లను చెప్పొచ్చు. బస్సులు అంతర్జిల్లా ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగపడతాయి. కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లాలన్నా, సుదూర ప్రయాణాలు చేయాలన్నా ప్రజలు రైళ్లనే ఆశ్రయిస్తారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ సర్వీసులను విరివిగా వినియోగిస్తారు. తక్కువ ధరలో ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఈ సేవలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఇక, దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ రైల్వే సేవలు విస్తరించి ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే నెట్వర్క్ విస్తరించింది. అయితే, ప్రస్తుతం దేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రం ఒక్క రైల్వేస్టేషను కూడా లేదు.
అవునండీ, వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఇప్పటికీ ఒక్క రైల్వేస్టేషను కూడా లేదు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఈ రాష్ట్రం ఇంకా ఏ రైల్వే వ్యవస్థతోనూ అనుసంధానం కాలేదు. సిక్కింలో రవాణా మొత్తం రోడ్డు మార్గం గుండానే సాగుతుండటం గమనార్హం. ఎన్‌హెచ్ 10 నేషనల్ హైవే ద్వారా ఇతర రాష్ట్రాల వెహికిల్స్ సరిహద్దులు దాటుతుంటాయి. 6 లక్షలకు పైగా జనాభా కలిగిన సిక్కింలో ఎవరైనా రైళ్లలో ప్రయాణించాలనుకుంటే మాత్రం పొరుగున ఉన్న వెస్ట్ బెంగాల్‌కు వెళ్లాల్సిందే. బెంగాల్‌లోని సిలిగుడి, జల్పాయ్గుడి రైల్వే స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు సిక్కిం వాసులు.
సిక్కిం రాష్ట్రంలో ఇన్నాళ్లూ రైల్వే లైన్లు లేకపోవడానికి ఓ కారణం ఉంది. అది అక్కడి భౌగోళిక పరిస్థితులేనని చెప్పొచ్చు. ఈ రాష్ట్రంలోని చాలామటుకు ప్రాంతాలు ఎత్తయిన పర్వతాలపై ఉంటాయి. దీంతో గతంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అలాంటి క్లిష్టమైన ప్రదేశాల్లో రైల్వేలైను ఏర్పాటు చేయడానికి కుదరలేదు. 2008లో రైల్వే శాఖ.. బెంగాల్‌ను సిక్కింతో కలిపేందుకు సివోక్ – రాంగ్పో రైలు మార్గం నిర్మించే దిశగా ప్రయత్నించింది. అయితే నిధుల కేటాయింపు, ఇతరత్రా కారణాల వల్ల అనుమతుల్లో ఆలస్యమైంది.
సివోక్ – రాంగ్ పో రైల్వేలైన్‌కు 2016లో అడ్డంకులు తొలగిపోయినప్పటికీ నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా ఆలస్యమైంది. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని భావించినా.. కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలో ఇది పూర్తవుతుందని రైల్వే అధికారులు అంటున్నారు. ఒకవేళ సివోక్ – రాంగ్ పో రూట్ వర్క్ క్లియర్ అయితే.. ఆ తర్వాత రెండో దశలో గ్యాంగ్‌టక్‌కు రైళ్ల రాకపోకలు సాధ్యమవుతాయని చెబుతున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.