దేశంలో ఇప్పుడు మళ్లీ కరోనా కల్లోలం సృస్టిస్తుంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ అయితే ఇప్పుడు ఒమిక్రాన్ కొత్తగా వచ్చిన వేరియంట్ ప్రపంచ దేశాలను మళ్ళీ గజగజా వణికిస్తోంది. కోవిడ్ 19 కొత్త రూపాన్ని సంతరించుకుని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. కోవిడ్ నిబంధనలు కఠనంగా పాటించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొంత మంది నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ ప్రబలిపోతుంది. పార్టీతో ఎంజాయ్ చేద్దామనుకున్న వైద్య విద్యార్థులకు కరోనా మహమ్మారి షాకిచ్చిన ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఇటీవల ఫ్రెషర్స్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా నిబంధనలన్నీ గాలికొదిలేసి పార్టీని ఎంజాయ్ చేశారు. ఇదే వారికి శాపంగా మారింది. పార్టీలో పాల్గొన్న విద్యార్థుల్లో ఏకంగా 182 మంది కరోనా బారిన పడ్డారు. ట్విస్ట్ ఏంటంటే.. కరోనా సోకిన వారంతా దాదాపు రెండు డోసులు తీసుకున్నవారు కావడం గమనార్హం. అయితే కరోనా రెండు డోసులు తీసుకున్నామని.. తమకు ఏమీ కాదని కొంత మంది ధైర్యంగా కరోనా నిబంధనలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ సంఘటన ఆందోళన పెంచుతోంది.
దార్వాడ్ లోని ఎస్డీఎం మెడికల్ కాలేజీలో తొలుత 300 మందికి కరోనా పరీక్షలు చేయించారు. వీరిలో 66 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.తర్వాత మరో 116 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థుల సంఖ్య 182కి చేరింది. అయితే కరోనా భారిన పడ్డవారంతా.. ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న వారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీ కొవిడ్ క్లస్టర్ గా మారిపోయింది. కరోనా కేసులపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించారు. . కాలేజీలో ఉన్న దాదాపు 3 వేల మంది విద్యార్థులకు, మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు కరోనా బారిన పడినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.