పిల్లల మీద తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు అవ్వాతాతలు. తమ వయసును మర్చిపోయి.. మనవళ్లు, మనవరాళ్లతో కలిసి బాల్యంలోకి తిరిగి వెళ్తారు. వారితో ఆడుకుంటూ.. ఆనందంగా గడుపుతారు. ఇక చిన్నారులకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు. సమస్య పరిష్కారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధ పడతారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
పిల్లల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమానురాగాలుంటాయో.. అంతకు మించిన ప్రేమ, ఆప్యాయతలు తాత, అవ్వలు పెంచుకుంటారు. ముది వయసులో మనవలు, మనవరాళ్ల ప్రేమలో తడిసి ముద్దయిపోవాలని ఆశిస్తారు. పిల్లలకు కూడా తల్లిదండ్రుల కంటే అవ్వాతాతల దగ్గరే చనువు, గారాబం ఎక్కువ. ఉమ్మడి కుటుంబాల కాలంలో పిల్లలు ఎక్కువగా తాతాఅవ్వల దగ్గరే పెరిగేవారు. వారి పక్కన పడుకుని.. వారు చెప్పే కథలు, పద్యాలు వింటూ నిద్రపోయేవారు. బాల్యంలోనే వారికి బలమైన బంధాలు లభించేవి. అవే ముందు ముందు వారు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి ఉపయోగపడేవి. అయితే నేటి మైక్రో ఫ్యామిలీల యుగంలో ఆ బంధాలు కనుమరగవుతున్నాయి.
అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉండాలి. ముసలి వాళ్లు అంటే భారంగా భావించేవారు మన సమాజంలో కొకొల్లలు. కానీ ఆ పండుటాకులు మాత్రం.. వీరిపై గంపెడు ప్రేమను పెంచుకుంటారు. చిన్న పలకరింపుకే మురిసిపోతారు. ఇక మనవడో, మనవరాలికో చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడతారు. అవసరమనుకుంటే తమ ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా సిద్ధమవుతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. మనవడి కోసం ఓ అవ్వ ఎంతటి త్యాగం చేసిందో తెలిస్తే.. మీ గుండె బరువెక్కుతుంది. ఆ వివరాలు..
ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.18 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మనవడి కోసం 73 ఏళ్ల వయసులో కిడ్నీ దానం చేసి.. మనవడికి నూతన జీవతాన్ని ప్రసాదించింది ఓ బామ్మ. హరుగేరి ప్రాంతానికి చెందిన సచిన్(21) మూడో ఏట నుంచి అనగా 18 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇక కొన్ని రోజుల క్రితం ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బ తిన్నది. ఈ క్రమంలో వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కుమారుడి బాధ చూడలేక.. తల్లిదండ్రులు తమ కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ వారు కూడా అనారోగ్యం బారిన పడటంతో.. వీలుకాలేదు.
ఈ క్రమంలో మనవడు పడుతున్న బాధ చూడలేక.. సచిన్ నానమ్మ ఓ నిర్ణయం తీసుకుంది. 73 ఏళ్ల వయసులో తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మనవడికి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చింది. ఏడు పదుల వయసుల్లోనూ ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో.. వైద్యులు వృద్ధురాలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి అంగీకరించారు. ఈ క్రమంలో డాక్టర్ రవీంద్ర మద్రాకి నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించి.. విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. ప్రస్తుతం సచిన్, అతడి బామ్మ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఏడు పదుల వయసులో.. మనవడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ కిడ్నీ దానం చేసిన ఆమెను వైద్యుల బృందం ఘనంగా సత్కరించింది.
ఇక బామ్మ చేసిన త్యాగం వల్లే తనకు పునర్జన్మ లభించింది అంటూ సంతోషం వ్యక్తం చేశాడు సచిన్. తనకు నూతన జీవితాన్ని ప్రసాదించిన బామ్మకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. బామ్మ చేసిన సాహసంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మనవడి కోసం ఈ బామ్మ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.