సాధారణంగా జన్యులోపాల కారణంగా విచిత్రమైన ఆకారంలో శిశువులు జన్మిస్తుంటారు. కాకపోతే అలా పుట్టిన శిశువులు కొద్ది నిమిషాలు, గంటల వ్యవధిలోనే చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా మూడు కాళ్లతో పుట్టిన దూడ, ఏనుగు తొండంతో పుట్టిన వరాహం, రెండు తలలు ఉన్న ఆవుదూడ ఇలా జంతువులు జననం గురించి మనం వింటుంటాం. అప్పుడప్పుడు మనుషులకు కూడా నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు తలలు తో పుట్టిన వింత శిశువుల గురించి వార్తలు చూస్తుంటాం. తాజాగా బీహార్ లో ఓ తల్లి వింత శిశువుకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే..
అప్పుడప్పుడు విచిత్రమైన రూపంలో శిశువులు జన్మిస్తుంటారు. కొంతమంది అది దైవ సంకల్పం అని.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారని.. ఇక వైద్యులు మాత్రం జన్యులోపం అని చెబుతుంటారు. ఏది ఏమైనా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. బీహార్‌లోని సరన్ జిల్లాలో ఛప్రా నగరంలో ఓ ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. చప్రా పట్టణంలో శ్యామ్చక్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రియా దేవి అనే మహిళకు 4 చేతులు, 4 కాళ్ళు ఉన్నాయి, రెండు గుండెలు, వింత ఆకారంలో తలతో ఉన్న వింత ఆకారమైన బాలికకు జన్మనిచ్చింది. మహిళ పురిటి నొప్పితో ఇబ్బంది పడటంతో ఆసుపత్రి యాజమాన్యం ఆపరేషన్ చేసి బాలికను బయటకు తీశారు. శిశువును బయటకు తీసిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెబుతున్నారు.
ఆపరేషన్ చేసి బయటకు తీసిన తర్వాత నవజాత శిశువు సజీవంగానే ఉంది. దాదాపు 20 నిమిషాల తర్వాత బిడ్డ కన్నుమూసింది. ఈ విషయం గురించి హాస్పిటల్ డైరెక్టర్ అనీల్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి కేసులు చాలా అరుదుగా చూస్తుంటామని.. గర్భాశయంలోని ఒకే గుడ్డు నుంచి ఇద్దరు పిల్లలకు పుట్టిన సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. వైద్య పరిభాషలో ఇలాంటి పిల్లలను ‘కంజాయిన్డ్ ట్విన్స్’ అని అంటారని డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగానే ఉందని.. పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.