ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై ఆయన గెలుపొందారు. మంచు విష్ణు గెలుపుకు సంబందించి చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ‘మా’ ఎన్నికలపై చాలా మంది వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీని సైతం ‘మా’ ఎన్నికలపై రియాక్ట్ అయ్యారు.
ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి ‘మా’ ఎన్నికల్లో వివాదాలపై తనదైన స్టైల్లో స్పందించారు. అందరి హీరోల మధ్య మాలాంటి ఆహ్లాదకర వాతావరణం ఉంటే.. ఇలాంటి వివాదాలు, కొట్టుకోవడాలు, మాటలు అనడం, అనిపించుకోవడం ఉండదు కదా.. అని మరో నటుడు వెంకటేష్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.
ఏదైనా సరే శాశ్వతం కాదు.. రెండేళ్లుంటాయా.. మూడేళ్లు ఉంటాయా.. నాలుగేళ్లు ఉంటాయా.. ముఖ్యంగా చిన్న చిన్న పదవులు, బాధ్యతల్లాంటివి.. వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే.. బయటి వాళ్లకు ఎంతటి లోకువ అవుతాం.. అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఒక పదవి కోసం అంత లోకువ కావాలా అని ప్రశ్నించిన చిరంజీవి, అది ఎవరైనా కానీయ్.. నేను ఏ ఒక్కరినీ వేలెత్తి నిందించడం లేదు.. ప్రతీ ఒక్కరూ మెచ్యూర్డ్‌గా, విజ్ఞతతో ఉండాలి.. అంతే తప్ప.. మన ఆధిపత్యం, ప్రభావం చూపించడానికి చేయకూడదు.. వాళ్లు అన్నారు కదా, అని మనం అనకూడదు.. సమస్య ఎక్కడ ప్రారంభం అయిందా అనేది చూడాలి. ఎవరి మూలాన ఇలాంటి వివాదాలు ప్రారంభమయ్యాయో అతడికి హోమియో వైద్యం చేయించాలి.. అని చిరంజీవి అన్నారు.
మొదళ్ల నుంచి వ్యాధిని తొలిగించే లక్షణం హోమియోపతి వైద్యానికి ఉంటుంది.. మనం కూడా మూలాల్లోకి వెళ్లాలి.. అలాంటి వారిని గుర్తించాలి.. వారిని గనుక దూరం పెడితే ఇప్పుడు మేం ఎలా ఉన్నామో అందరూ అలా వసుదైక కుటుంబంలా ఉంటాం.. ఆత్మీయంగా, ఆప్యాయంగా, ప్రేమగా ఉండాలే తప్పా.. చిన్నచిన్న గొడవలతో అవతలి వారికి లోకువ కాకూడదు.. ముఖ్యంగా మీడియా వారికి మనం ఆహారం అయిపోకూడదు.. అని చిరంజీవి ‘మా’ ఎన్నికల్లో వివాదాలపై కొంత మందికి సున్నితంగా హెచ్చరించారు. ఇకపై అందరం కలిసిమెలిసి ఒక కుటుంబం లా ఉందామని పిలుపునిచ్చారు.