ఫిల్మ్ డెస్క్- కరోనా ఎవ్వరిని వదలడం లేదు. మెల్లమెల్లగా చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది. సినీ, క్రీడా ప్రముఖులకు సైతం కరోనా సోకుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు.
తనకు కరోనా సోకిందంటూ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండాలని మహేష్ బాబు ట్విటర్ ద్వారా సూచించారు.
అంతే కాదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోరనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మహేష్ బాబు చెప్పారు. అన్నట్లు మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరశురామ్ డైరెక్టర్.
సర్కారు వారి పాట సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కరోనా బారిన పడటంతో సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడిందని తెలుస్తోంది.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022