ఫిల్మ్ డెస్క్- ప్రస్తుతం భారత్ సినిమా ప్రపంచంలో బయోగ్రఫీ కాలం నడుస్తోంది. దేశంలోని ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు రూపోందుతున్నాయి. బయోగ్రఫీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభిస్తుండటంతో నిర్మాతలు ఈ సినిమాల మేకింగ్ పై దృష్టి పెట్టారు. తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం తలైవి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తలైవీ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల మందుకు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తలైవి నుంచి కొత్త ప్రచార పోస్టర్ ను చిత్ర బృందం విడుదలచేసింది. అందులో కంగనా రనౌత్ విభిన్న అవతారాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
ఈ ప్రచార పోస్టర్స్ లో సినిమా హీరోయిన్‌గా, రాజకీయ నాయకురాలిగా కంగనా రనౌత్ కనిపించారు. దివంగత సీఎం జయలలిత మాదిరిగానే కొంగును భుజాల నిండుగా కప్పుకొని విజయ సంకేతం చూపుతూ, ఇందిరా గాంధీని కలిసిన సందర్భంలో, ఎంజీఆర్ సరసన స్టెప్పులేస్తూ, ఆయనకు అభివాదం చేస్తూ విభిన్న గెటప్పుల్లో కంగనా కనిపించారు. అన్నట్లు తలైవి సినిమాలో ప్రముఖ నటుడు అరవిందస్వామి ఎంజీఆర్‌గా నటించారు. మన దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించారు. తలైవి సినమాకు ఎల్ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.