‘టామ్ క్రూజ్’ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నటుడు, నిర్మాత. టామ్‌క్రూజ్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్. ఇప్పటి వరకు ఆరు పార్టులు రిలీజయ్యి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలక్షన్ల వర్షం కురిపించాయి. టామ్‌లో మరో ఇంట్రస్టింగ్ కోణం ఏంటంటే సినిమాల్లో స్టంట్లు మొత్తం ఆయనే చేస్తారు. ఆయనకి డూప్ ఎవరూ ఉండరు. ‘జాకీచాన్’ తర్వాత షూటింగ్ సమయంలో అన్నిసార్లు గాయాలపాలైన హీరో టామ్‌క్రూజ్ అనడం అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్‌లో 7, 8 పార్టులు చిత్రకరణ దశలో ఉన్నాయి. మిషన్ ఇంపాజిబుల్-7ను జులై 23, 2021లో విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా రిలీజ్‌ను మే 27, 2022 సంవత్సరానికి మార్చారు. తాజాగా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో షూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. బొగ్గును తరలిస్తున్న ఓ గూడ్స్ రైలు ట్రాక్‌పై నుంచి క్వారీలోకి పడిపోతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
స్టోనీ మిడల్‌టన్‌లోని డాల్టన్ క్వారీలో గతకొన్ని నెలలుగా చిత్రబృందం సెట్స్ నిర్మిస్తున్నారు. ఇది మిషన్ ఇంపాజిబుల్‌దే అనడానికి టామ్‌క్రూజే సాక్షం అనమాట. మొత్తం సీన్ షూటింగ్ టామ్ వీక్షిస్తున్నట్లు స్థానికులు చూశారు. టామ్ సెట్స్‌లో కనిపించగానే ఇది మిషన్ ఇంపాజిబుల్ అని ఫిక్స్ అయిపోయారు. షూటింగ్ మొత్తాన్ని స్థానిక ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసి.. సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్, ప్రొడక్షన్ పనులు హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని వార్నర్ బ్రదర్స్ స్టూడియో, యూకేలో పలు లొకేషన్స్‌లో కొనసాగుతోంది.