భారత విజయవంతమైన వికెట్ కీపర్ అంటే అభిమానులందరికీ మహేంద్రసింగ్ ధోనీ పేరే గుర్తు వస్తుంది. కానీ అంతకుముందు కనీసం అనుభవం కూడా లేకుండా కీపర్‌గా కొనసాగిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అసలు ఆ బాధ్యతలు స్వీకరించడం వెనుక చాలా పెద్ద కథే జరిగింది.
2003 వన్డే ప్రపంచకప్ జట్టులో రాహుల్ ద్రవిడ్ స్థానం పదిలంగా ఉండటం కోసమే.. అతడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారనే వ్యాఖ్యలో నిజం లేదని.. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. నయన్ మోంగియా గాయపడటంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా కసరత్తే జరిగిందని దాదా తాజాగా వెల్లడించాడు. ఒక్కసారి వికెట్ల వెనుక సరైన ప్రదర్శన చేయలేకపోతే దాని ప్రభావం బ్యాటింగ్‌పై పడి కెరీర్‌కే నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రాహుల్ ద్రవిడ్ ఈ అంశంపై చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడని గంగూలీ తెలిపాడు. ఆ సమయంలో మరే ఆటగాడు అందుబాటులో లేకపోవడంతో జట్టు కోసం వికెట్ కీపర్ అవతారమెత్తాల్సిందే అని ద్రవిడ్‌కు నచ్చజెప్పినట్లు వివరించాడు. అంతే కాకుండా మరో ఇంట్రెస్టింగ్ అంశాన్ని దాదా బయట పెట్టాడు.
‘వికెట్ కీపింగ్ అంశంపై రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడిన అనంతరం నా స్పోర్ట్స్ మ్యానిఫ్యాక్చర్ జతిన్ సరీన్‌తో మాట్లాడా.. నాకు మూడు సెట్ల వికెట్ కీపర్ ప్యాడ్లు, గ్లౌజ్‌లు పంపాలని చెప్పా. దీనిపై అతడు భిన్నంగా స్పందించాడు. ‘‘అసలు నీకు వికెట్ కీపింగ్ అనుభవమే లేదు.. అలాంటిది కీపింగ్ ప్యాడ్స్‌తో ఏం చేస్తావ్’’ అని బదులిచ్చాడు. నా కోసం కాదు మా స్నేహితుడికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా.. నువ్వు అర్జెంటుగా ప్యాడ్లు, గ్లౌజ్‌లు పంపు అని చెప్పా.. అదే సమయంలో వెస్టిండీస్ పర్యటన ఉండగా.. ఆ బహుమతిని నేను రాహుల్ ద్రవిడ్‌కు అందించా’ అని సౌరవ్ గంగూలీ ఓ కార్యక్రమంలో వెల్లడించాడు. అలా మొదలైన ప్రస్థానం విజయవంతంగా ముందుకు సాగిందని పేర్కొన్నాడు.
అదనపు సామాగ్రి పెట్టుకునేందుకు జట్టు సభ్యులంతా కలిసి ద్రవిడ్‌కు పెద్ద కిట్ బ్యాగ్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాన్ని దాదా గుర్తు చేసుకున్నాడు. అటు బ్యాటింగ్ సామాగ్రితో పాటు.. వికెట్ కీపింగ్ బ్యాట్లు, గ్లౌజ్‌లో అదనంగా చేరడంతో అది మిగిలిన వాళ్ల కిట్ బ్యాగ్‌తో పోల్చితే చాలా పెద్దగా ఉండేదని.. దాన్ని మోయడం కూడా కష్టమయ్యేదని గంగూలీ నవ్వులు పూయించాడు. జట్టు కోసం ఈ బాధ్యతలు భుజానెత్తుకున్న ద్రవిడ్ దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాడని వెల్లడించాడు. అంతేకాని ప్రచారంలో ఉన్నట్లు వన్డే జట్టులో చోటు కల్పించడం కోసమే ‘ది వాల్’ను వికెట్ కీపర్‌గా మార్చమనేది అబద్ధమని కుండబద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్లో 210 క్యాచ్‌లు పట్టి ప్రపంచంలోనే అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ద్రవిడ్.. జట్టు కోసం ఏ పని చేసేందుకైనా వెనుకాడడని ఈ అంశంతో నిరూపితమైంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌కు పాల బుగ్గల పసివాడు పార్థివ్ పటేల్ ఎంపికైనా.. ద్రవిడ్ అటు కీపర్‌గా ఇటు బ్యాటర్‌గా రాణించడంతో అతడికి మ్యాచ ఆడే అవకాశమే దక్కలేదు.