ఆధునిక క్రికెట్ లో అవలీలగా సిక్స్ లు కొట్టగలిగిన అతి తక్కువ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. తాజాగా రోహిత్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో అతని ఎదురుచూపులు ఎవరి కోసమో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా కెప్టెన్ మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. గ్రౌండ్ బయట అంత పరాధ్యానంగా ఉంటాడు. ఇది వాళ్లో వీళ్లో చెప్పిన మాటలు కావు.. సుదీర్ఘ కాలంగా రోహిత్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టు మొత్తంలో అత్యధిక మతిమరుపు ఉన్న ప్లేయర్ ఎవరని అడిగితే.. ముక్తకంఠంతో రోహిత్ పేరే వినిపిస్తుందని కోహ్లీ ఓ కార్యక్రమం సందర్భంగా చెప్పాడు. తరచూ తన వస్తువులను మరిచిపోవడం రోహిత్‌కు ఉన్న చెడ్డ అలవాటని.. స్టేడియంలో ఎంత అప్రమత్తంగా ఉంటాడో.. బయట అంత రిలాక్స్‌డ్ గా ఉంటాడని వెళ్లడించాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో రోహిత్ వ్యవహార శైలి దీన్ని బయట పెట్టింది. టాస్ నెగ్గిన హిట్‌మ్యాన్‌ను కామెంటేటర్ రవిశాస్త్రి.. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? అని అడగగా.. కాసేపు తటపటాయించిన రోహిత్.. ఇందాకే చర్చించాం కానీ మర్చిపోయా అని చెప్పి నవ్వులు పూయించాడు. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది.
వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకోగా.. రెండో టెస్టు సందర్భంగా ఒక సరదా సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండో టెస్టులో మంచి స్థితిలో ఉన్న రోహిత్ సేన.. చివరి రోజు వరుణుడి ప్రతాపం కారణంగా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. సోమవారం ఎడతెరిపి లేని వర్షం కురవడంతో అంపైర్లు పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అనంతరం ఆట సాగడం సాధ్యం కాదని నిర్ణయించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ప్రకటించారు. ఇక అదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పదే పదే బయటి పరిస్థితిని గమనిస్తూ కనిపించాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మీమర్స్‌కు పండుగలా మారాయి. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
‘వేసవి సెలవుల అనంతరం తొలి రోజు స్కూల్‌కు వెళ్లాల్సి వచ్చిన సమయంలో నా పరిస్థితి ఇలాగే ఉండేది’ అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. ‘రాత్రి అమ్మమ్మ ఇంట్లో నిద్రించిన నేను ఉదయం లేచేసరికి ఇక్కడ ఉన్నానేంటి’ అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ‘పది గంటలకు నిద్ర లేచిన వ్యక్తి నేరుగా జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుందని’ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరి రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.