నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మెున్న దక్కన్ మాల్, నిన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలు మరువక ముందే మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న పరిస్థితి నెలకొంది. మెున్న దక్కన్ మాల్, నిన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలు మరువక ముందే రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ భారీగా ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోదాంలో నిలిపి ఉంచిన రెండు డీసీఎం వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్లాస్టిక్ గోదాం కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ఈ మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంభందించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.