వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన తమ చదువులను, చదువుకోవాలని ఉన్నా ఆర్థిక స్థోమత, ఇతర కారణాలతో చదువుకోలేక పోయిన వారికి వరంగా మారింది.. దూర విద్యా విధానం. దీని ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు. 55 ఏళ్ల మహిళ కూడా..
‘చదువే మనిషి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువు కోవడం కష్టం కాదు.. చదువంటే మనికిష్టం ఉంటే’అని ఓ కవి అన్నాడో కానీ..అదీ అక్షర సత్యం. ఈ రోజుల్లో ప్రైవేటు బుడులు వచ్చేశాయి కానీ.. గతంలో ప్రభుత్వ బడుల్లోనే చదువుకునేవారు. అయితే ఆ బడులకు కూడా పంపించేంత స్థోమత లేక లేదంటే ఇతర కారణాలతో పాఠశాలలకు పంపించేవారు కాదు తల్లిదండ్రులు. ముఖ్యంగా ఆడ పిల్లల విషయంలో కఠువుగా వ్యవహరించేవారు. మరో ఇంటికి వెళ్లిపోయే అమ్మాయికి చదువు ఎందుకని బడికే కాదూ.. బయటకు కూడా రానిచ్చేవారు కాదు. కానీ నేటి సమాజంలో ఇప్పుడు ప్రతిదీ చదువుతోనే ముడిపడి ఉంది. ఈ చదువే ఆమె అనుకున్న లక్ష్యానికి అవరోధంగా మారిందని తెలిసి.. 55 ఏళ్ల పదుల సంఖ్యలో పుస్తకం పట్టింది.. పరీక్షలు రాసింది పద్మ అనే మహిళ. ఇంతకు ఆమె ఈ వయస్సులో చదువుకోవాల్సి వచ్చిందంటే..?
వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు చిలక పద్మ. ఆమె వయస్సు 55 ఏళ్లు. అయితే ఆమెకు సర్పంచ్ కావాలన్నదీ కోరిక. అయితే అందుకు కాస్త చదువు, జ్ఞానం అవసరమని భావించింది. ఆమె ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకోగా..సర్పంచ్ పదవి కోసం విద్యార్హత పెంచుకోవాలని అనుకుంది. కానీ బడికో..కాలేజీకో పోయి మిగతా విద్యార్థులతో కలిసి చదువుకునే వయసు తనది కాదు. ఆమె కోరిక వరంగా మారింది దూర విద్య. చదువుకోవాలన్న ఆమె కోరికను దూర విద్య రూపంలో తీర్చుకోవాలనుకుంది. ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి పరీక్షలు ఫీజు కట్టారు. గత నెల 28 నుండి ఓపెన్ టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా.. ఆమె పరీక్షలకు హాజరయ్యారు.
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న చిలుక పద్మకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1లో సెంటర్ పడింది. జైనథ్ నుండి వచ్చి పోతూ పరీక్షలు రాసింది. పరీక్ష రాసేందుకు తన భర్త చిన్నన్న, మనవడితో కలిసి పరీక్షా కేంద్రానికి రావడం ఆసక్తిని కలిగించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ కావాలంటే పదవ తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలన్న నిబంధన ఉంటే తన లక్ష్యానికి అడ్డుకాకూడదని, తాను చదువుకుంటున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా చదువుకున్న వారు ప్రజాప్రతినిధులైతే ప్రజలకు మరింత సేవ చేయడానికి వీలువుతుందని పద్మ చెప్పుకొచ్చారు. ఈ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్షలు బాగా రాసినట్లు తెలిపారు. భవిష్యత్తులో సర్పంచ్ కావాలన్న ఆమె ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం.