హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో మాస్కులు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయో వేరే చెప్పక్కర్లేదు. కరోనాను అడ్డుకోవడంలో మాస్కులే ప్రధాన కిలకంగా ఉపయోగపడుతున్నాయి. నిరు పేద నుంచి ప్రధాని వరకు అందరు తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందే. కరోనా మనకు సోకకుండా ఉండాలంటే ఇంట్లో కూడా మాస్కు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారంటే మాస్కు యెక్క ప్రాధాన్యత ఎంతో అర్ధమవుతుంది. ఐతే మాస్కులు సరైన పద్దతిలో ఉపయోగించకపోతే మాత్రం మరో ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడిన మాస్క్‌ను ఉతకకుండా మరోసారి వాడితే ఫంగస్ బారినపడే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది. అపరిశుభ్రమైన, ఉతకని మాస్క్‌ను ధరించేవారికి ఈ ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులంటున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మ్యుకోర్‌మైకోసిస్ గా పిలవబడుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్నవారి వైద్య నివేధికలు పరిశీలించినపుడు, వారు ఉతకని మాస్క్‌లను ఎక్కువ సమయం వాడినట్లు గుర్తించారు. చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో నివసించినట్లు పరిశీలనలో తేలిందట. అందుకే మాస్క్‌లను ఉతకకుండా ఎక్కువ సమయం వాడటం, బేస్ మెంట్లు, తక్కువ గాలి ప్రసరించే చోట ఉండటం వంటి వాటి వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు ఎక్కువగా గాలి ప్రసరించని, వెలుతురు రాని చీకటి గదుల్లో నివసించడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. అందుకని ఇకపై మాస్కులను ప్రతి రోజు ఉతుక్కుని వాడుకోవాలని గుర్తుంచుకొండి.