వరుస పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ విస్తరించింది. 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 30 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
కాగా, పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 రోజుల ముందుగానే తమ సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల బస్సు సర్వీసుల్లో ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కేఎస్‌బీ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.