తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించి రెండు రోజులు కూడా గడవక ముందే పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణం చెందారు. స్వగృహంలో గుండెపోటు కారణంగా ఆయన కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఒకరకంగా బయటకు రావటం పూర్తిగా తగ్గించేశారు. ఆయనకు పెద్దగా అనారోగ్యం కూడా ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించటం అందరినీ కలచి వేస్తోంది. అయితే, గతంలో చోటుచేసుకున్న ఓ ప్రమాదం కారణంగా చాలా ఏళ్ల నుంచి చలపతి రావు బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
2018 టైంలో హీరో అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమా మొదలైంది. ఆ సినిమాలో చలపతి రావు ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఓ షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి కిందపడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. చిత్ర బృందం వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాతినుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లకు కొంచెం కొంచెంగా దూరం అయినట్లు సమాచారం. కొన్ని నెలలుగా పూర్తిగా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చలపతి రావు మరణానికి గుండెపోటే కారణమైనా..
ఆయన మెత్త బడటానికి కారణం మాత్రం షూటింగ్‌లో జరిగిన ప్రమాదంగా భావిస్తున్నారు. కాగా, చలపతి రావు 1944లో కృష్ణా జిల్లాలో పుట్టారు. సీనియర్ ఎన్టీ రామారావు కారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. తన కెరీర్‌లో అన్ని రకాల పాత్రల్ని చేశారు. ఇప్పటివరకు దాదాపు 1500లకు పైగా సినిమాలు చేశారు. చలపతి రావుకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రవి బాబు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నటుడిగా రానిస్తున్నారు. ఇక, అమెరికాలో ఉన్న ఆయన కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఆయన భౌతిక దేహాన్ని రవి బాబు ఇంట్లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. బుధవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.