ఉర్ఫీ జావెద్.. సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన కొత్త కొత్త, వింత వింత లుక్స్‌తో తరచుగా నెటిజన్ల మతి పోగొడుతూ ఉంటారు. ఈ మేరకు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో బోల్డ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా ఎంత వ్యతిరేకత వచ్చినా.. ఇబ్బందులు ఎదురైనా తన పంథా మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. ‘‘నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో’’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను చిన్న పిల్లలు కూడా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అయితే, ఇది సోషల్ మీడియా వేదికగా కాదు..
నేరుగా ఫోన్ చేసి మరీ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. దీంతో ఉర్ఫీ జావెద్ మనోవేదనకు గురవుతున్నారు. తనపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీస్ కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా, తన సోషల్ మీడియా వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు. ఓ పిల్లాడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. ‘‘ ఈ పిల్లాడు అతడి 10 మంది ఫ్రెండ్స్ నాకు ఎడతెరపి లేకుండా ఫోన్ చేస్తున్నారు. నేను ఈ నెంబర్‌ను చాలా ఏళ్ల నుంచి వాడుతున్నాను. వాళ్లకు ఈ నెంబర్ ఎలా దొరికిందో అర్థం కావటం లేదు. కాల్ చేసి బూతులు తిడుతున్నారు. వాళ్లు ఎందుకలా చేస్తున్నారు.
ఎందుకు అనవసరంగా ఇతరులను వేధిస్తున్నారు. వీరిపై నేను కేసు పెట్టాలని నిశ్చయించుకున్నాను. మీకు గనుక వారి తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే.. దయచేసి నాకు చెప్పండి’’ అని కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలోనూ చాలా మంది నెటిజన్లు దారుణంగా ఉర్ఫీ జావెద్‌ను ట్రోల్ చేశారు. నువ్వు ఛస్తే కుక్కలు కూడా ఏడవవు అని విమర్శించారు. సిద్దూ మూసే వాలాకు బదులు ఈమెను కాల్చి చంపి ఉంటే బాగుండేదని కూడా కొంతమంది అన్నారు. దీంతో ఉర్ఫీ బాధపడ్డారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తాను అనుకున్నది చేస్తానని స్పష్టం చేశారు.