ప్రస్తుత కాలంలో హీరోయిన్ అంటే ఒంటి మీద కేజీ కండ లేకుండా.. తెల్లగా మెరిసిపోవాలి. కలర్ కాస్త తక్కువగా ఉన్నా సరే.. అస్సలు ఊరుకోరు. తెల్లగా సున్నం కొట్టినట్లు కేజీల కొద్ది మేకప్‌తో కవర్ చేస్తారు. కానీ పాతిక సంవత్సారలు వెనక్కి వెళ్లండి.. హీరోయిన్ అంటే ముద్దుగా, బొద్దుగా ఉండాలి. కలర్‌తో పని లేదు.. ముఖంలో కళ ఉందా లేదా అన్నది మాత్రమే చూసేవారు. నాటి తరం హీరోయిన్ల ముందు.. ఇప్పటి వారు ప్రతి అంశంలో తేలిపోతారు. అలా రంగు తక్కువ ఉన్నా సరే.. తన కళ్లతో కట్టిపడేసి.. ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా అలరారిన హీరోయిన్ సరిత. ఈ పేరు వినగానే ప్రేక్షకుల మదిలో మెదిలే చిత్రం.. మరో చరిత్ర. అగ్ర దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా.. సరిత హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది.. చరిత్రలో నిలిచిపోయింది. నల్లగా ఉన్న సరే.. ఆకర్షణీయమైన రూపం ఉండటం సరితకు కలిసి వచ్చింది. అదే బాలచందర్‌ను ఆకర్షించి.. మరో చరిత్ర సినిమా ద్వారా సరితను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ఇక సరిత అచ్చ తెలుగమ్మాయి. ఆమె అసలు పేరు అభిలాష. 1963లో గుంటూరులో జన్మించింది. మరో చరిత్ర సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయంమైన సరిత.. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూ.. ఫుల్ బిజీ అయ్యింది. అప్పట్లో గ్లామర్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి ధీటుగా సరిత అవకాశాలు అంది పుచ్చుకుంది. కమల్ హాసన్ మొదలు చిరంజీవి వరకు పలువురు స్టార్ హీరలతో నటించింది. ఇదే కాక సరితకు మరో ప్రత్యేకత ఉంది. హీరోయిన్‌గానే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో అవార్డులు అందుకుంది సరిత. సౌందర్య మొదలు.. నేడు నదియా వరకు ఎందరికో తన గొంతు అరువిచ్చింది.. ఇస్తూనే ఉంది సరిత.
ఇక సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సరిత.. ఆ తర్వాత బుల్లితెర మీద కూడా కొనసాగింది. ఇక మహేష్ బాబు అర్జున్ చిత్రంలో సరిత పండించిన విలనీజం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు సరిత. ఇక కెరీర్లో ఎంతో విజయవంతంగా రాణించిన సరిత.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో ఎంతో మోసపోయారు.
సినిమాల్లోకి రావడానికి ముందే సరితకు వెంకటసుబ్బయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే సినిమాల మీద ఆసక్తితో సరిత.. తన భర్తకు విడాకులు ఇచ్చి.. ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత ఆమెకు ప్రముఖ కెమరామెన్ నవకాంత్తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారటం వెంటవెంటనే జరిగిపోయాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ విధి ఆమె పట్ల చిన్న చూపు చూసింది. నవకాంత్ ఉన్నట్లుండి మృతి చెందాడు. దాంతో సరిత జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. ఆ బాధ నుంచి త్వరగా కోలుకోలేకపోయింది. కెరీర్‌ను పట్టించుకోవడం మానసేంది. దాంతో కొన్నాళ్లపాటు చిత్ర పరిశ్రమకు దూరమయ్యింది.
అయితే కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అంటారు. సరిత జీవితంలో కూడా అలానే జరిగింది. నవకాంత్ మృతితో విషాదంలో మునిగిని సరితను కాలం ఓదార్చింది. భవిష్యత్తు గురించి హెచ్చరించింది. దాంతో తనకు తానే ధైర్యం చెప్పుకుని.. మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. ఈ క్రమంలో ఆమె తోటి నటుడు ముఖేష్‌ని వివాహం చేసుకుని.. ఇద్దరు బిడ్డలను కూడా కన్నది. అయితే మరోసారి విధి.. సరితను చిన్న చూపు చూసింది. మరో మహిళతో సంబంధం పెట్టుకున్న ముఖేష్.. సరితకు విడాకుల నోటీసు ఇచ్చాడు.
అయితే ఆమె బదులివ్వదేన్న కారణంతో.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీనిపై ఆమె కోర్టులో ఫిర్యాదు చేసిన లాభం లేకపోయింది. ఈ ఒడిదుడుకుల నేపథ్యంలో పరిశ్రమకు దూరం జరిగి.. బిడ్డలను తీసుకుని దుబాయ్ వెళ్లిపోయింది సరిత. ఇద్దరు కొడుకులతో కలిసి అక్కడే ఉంటుంది. డబ్బింగ్ చెప్పడం కోసం ఇండియాకు వస్తుంటుంది. వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిన సరిత.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చవి చూసింది.