హీరోగా అన్ని తరహా పాత్రలు చేసినా.. కథానాయకుడిగా రావాల్సిన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయాడు సుమంత్. అందుకే ఈసారి రూటు మారుస్తున్నాడట ఈ అక్కినేని కాంపౌండ్ హీరో. అక్కినేని కుటుంబంలోని మూడోతరంలో ముందుగా వచ్చిన కథానాయకుడు సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు కూతురు కుమారుడైన సుమంత్..1999లో ‘ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత ‘యువకుడు’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘మధుమాసం’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీరావా’ వంటి క్లాస్, మాస్ మూవీస్ తో ఆకట్టుకున్నాడు సుమంత్. అయినా.. హీరోగా ఆశించిన స్థాయి గుర్తింపును మాత్రం సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సుమంత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సుమంత్ ప్రస్తుతం హీరో క్యారెక్టర్స్ కి బ్రేక్ ఇచ్చి క్యారెక్టర్స్ లోకి దిగాలని ఫిక్స్ అయ్యాడట. ఈ దశగా అప్పుడే తొలి అడుగులు వేసినట్టు తెలుస్తోంది. ఫీల్ గుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట సుమంత్. ‘లెప్టినెంట్ రామ్’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. 1960ల కాలం నాటి కథతో మిలటరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో సుమంత్ క్యారెక్టర్ హైలెట్ గా నిలవబోతుందట. మరి.. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సుమంత్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.