బుల్లితెరపై కామెడీ షో అనగానే దాదాపు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు ‘జబర్దస్త్’. 2013లో ఇది ప్రారంభమైనప్పుడు ఎవరికీ కనీసం అంచనాల్లేవు. కానీ కొన్నిరోజులకే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఆరుగురు టీమ్ లీడర్స్, వాళ్లు చేసే స్కిట్స్, చివర్లో ఓ ఫన్నీ టాస్క్.. ఇలా ప్రతిదీ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. దీంతో షో నిర్వహకులు.. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ పేరుతో దీనికి తోడు మరో షో స్టార్ట్ చేశారు. అలా అప్పటి నుంచి మొదలైన వీటి జర్నీ.. ఇప్పటికీ సాగుతూనే ఉంది. కాకపోతే గతంలో టీవీ ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే చూసేవారు. ఇప్పుడు మాత్రం ప్రోమోలు మాత్రమే చూసి, కొందరు మాత్రం పూర్తి ఎపిసోడ్స్ చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా సుడిగాలి సుధీర్ హాట్ టాపిక్ అవుతాడు. ఎందుకంటే మనోడు షోలో అంత పాపులర్. టీం లీడర్ గా స్కిట్లు చేయడమే కాదు యాంకర్ రష్మీతో తెగ కెమిస్ట్రీ వర్కౌట్ చేసేవాడు. అది కాస్త యూట్యూబ్ లో సెన్సేషన్ అయిపోయింది. ఇక అప్పటినుంచి వీళ్లిద్దరిని బేస్ చేసుకుని స్కిట్స్, ప్రోగ్రామ్స్, షోలో ప్లాన్ చేశారు. కానీ కొన్నాళ్ల క్రితం సుధీర్.. ‘జబర్దస్త్’ షోతోపాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ నుంచి బయటకొచ్చేశాడు.
అప్పటినుంచి ఎందుకు బయటకొచ్చేశాడు అనే విషయం గురించి అందరూ తెగ చర్చించుకున్నారు. ఆ తర్వాత వేరే ఛానెల్స్ లో సింగింగ్, టాక్ షోలకు యాంకర్ గా చేశాడు. ఏమైందో ఏమో గానీ అవి పూర్తయిన తర్వాత అంటే కొన్నాళ్ల నుంచి సుధీర్.. టీవీల్లో ఏ షోలోనూ కనిపించలేదు. దీంతో సుధీర్.. యాంకరింగ్ కెరీర్ కి వీడ్కోలు పలికాడా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అలాంటిదేం లేదని సుధీర్ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ఎందుకంటే ఆహా ఓటీటీలో త్వరలో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ పేరుతో స్టాండప్ కామెడీ షో స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సుధీర్ యాంకర్ గా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే ‘జబర్దస్త్’కి పోటీగానే ఈ షోని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సుధీర్ యాంకర్ గా చేస్తున్న ఈ షోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో?