దర్శక ధీరుడు రాజమౌళికి మన దేశంలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో హాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాట.. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రాజమౌళితో పని చేయడం కోసం సౌత్‌లోనే కాక.. బాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలు అనుకుంటారు. రాజమౌళి నుంచి పిలుపు వస్తే చాలు అని భావించే వారు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. స్టార్ హీరోలు, టాప్ మ్యూజిషియన్‌లు సైతం.. రాజమౌళి పిలుపు కోసం ఎదురు చూస్తారు. అది జక్కన్న క్రేజ్. అలాంటి రాజమౌళి గురించిజ.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఆ వివరాలు..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమన్.. ఓ ప్రముఖ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సినిమాలకు మ్యూజిక్ అందించే విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వివరించాడు. విజయ్‌తో సినిమా చేయడం తన కల అని.. ఇన్నాళ్లకు అది నేరవేరింది అని చెప్పుకొచ్చాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమలోని నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంపై స్పందించాడు తమన్. ‘‘నాటు నాటు పాటకు తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుంది. రాజమౌళి గారు అందరికి ఓ మార్గం చూపారు. మూడేళ్ల పాటు అక్కడే ఉండి.. సినిమాను ప్రమోట్ చేశారు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు.
ఈ సందర్భంగా రాజమౌళి గారి సినిమాల్లో ఎప్పుడు కీరవాణి గారేనా.. నాకు అవకాశం వస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా అని ప్రశ్నిస్తే.. అందుకు తమన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘లేదు నాకు ఆ అవసరం లేదు. దేవి శ్రీ ప్రసాద్ పని చేసే దర్శకులు నంబర్లు కూడా నా దగ్గర ఉండవు. కొరటాల శివ, సుకుమార్ నంబర్లు నా దగ్గర లేవు. రాజమౌళి గారి నంబర్ కూడా నా దగ్గర లేదు. నా ప్రయాణంలో నేను సంతోషంగా ఉన్నాను. త్రివిక్రమ్ గారితో పని చేస్తున్నాను.. సంతోషంగా ఉన్నాను. నా టీమ్‌తో నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. తమన్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.