తెలుగులో గత కొన్నాళ్ల నుంచి రియాలిటీ షోల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అందులో భాగంగానే ప్రముఖ ఛానెల్స్ అన్నీ కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులని టీవీలకు కట్టేపడేయాలని చూస్తుంటాయి. అందుకు తగ్గట్లే ప్రోగ్రామ్స్ ని ఫుల్ ఆన్ మసాలా కంటెంట్ తో నింపేస్తుంటాయి. అలా ఎంటర్ టైన్ చేస్తున్న వాటిలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో టాప్ లో ఉంటుంది! ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షోలో ఎప్పటికప్పుడు కేక పుట్టించే కంటెంట్ ని ప్రెజంట్ చేస్తునే ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే ఓ డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ ఇచ్చిన హైపర్ ఆది.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోల్లో కామెడీ స్కిట్స్ మాత్రమే ఉంటాయి. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో మాత్రం వాటికి మించి అనేలా ఉంటాయి. పాటలు, స్కిట్స్, డ్యాన్స్.. ఇలా ఒకటేమిటి, ప్రేక్షకులకు ఏమేం కావాలో అందుకు తగ్గట్లే ప్లాన్ చేసి మరీ ఎంటర్ టైన్ చేస్తుంటారు. ఈ వారం కూడా హైపర్ ఆదికి పెళ్లి అనే కాన్సెప్ట్ తో ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు కనిపించారు. ప్రోమో స్టార్టింగ్ లో భార్యతో కలిసొచ్చిన పంచ్ ప్రసాద్.. ఆదిపై ఆటో పంచులేస్తూ తెగ నవ్వించాడు. ఈ పంచ్ లకు ఎలా రెస్పాండ్ కావాలో తెలీక ఆది తల పట్టుకున్నాడు.
ఇక ఇదే ఎపిసోడ్ లో ఇమ్మన్యూయేల్ బ్రేకప్ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వర్షతో ప్రస్తుత రిలేషిప్ స్టేటస్ గురించి బయటపెట్టాడు. దీంతో జడ్జి ఇంద్రజ.. ‘ఏమైంది వర్ష’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ మాస్టర్, తన భార్యతో కలిసి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ‘అదుర్స్’లోని చారి-బట్టులా గెటప్స్ వేసుకుని వచ్చిన ఆది-నరేష్.. ఆడియెన్స్ ని కితకితలు పెట్టించారు. ఇక లాస్ట్ లో ‘వల్లభ.. నా వల్లభ’ అనే రొమాంటిక్ పాటకి డ్యాన్స్ చేసిన హైపర్ ఆది.. స్టేజీపై రెచ్చిపోయాడు. అమ్మాయిలతో కలిసి హీట్ పెంచేశాడు. ఆదిలో ఈ యాంగిల్ చూసిన యాంకర్ రష్మీతో పాటు మిగతా అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు.