సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడిగానే కాకుండా గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారు.
సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్నారు నందమూరి తారక రామారావు.. నటుడిగానే కాకుండా గొప్ప రాజకీయ నాయకుడిగా, తెలుగువారి గుండెల్లో ‘అన్న’గా చెరిగిపోని స్థానం సంపాదించుకొన్నారు ఎన్టీఆర్. ఇప్పటికీ ఎంతోమంది హీరోలు సీనియర్ ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఆయన నటనను కొనియాడుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ చలనచిత్ర వైభవం భావితరాలకు సైతం స్ఫూర్తిదాయకం అని అంటుంటారు. అలాంటి గొప్ప నటుడు, నాయకుడు చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయారు ఎన్టీఆర్. కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ది పథకాలకు పునాది వేశారు. ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలు కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించిన ఆయన ఆఖరి రోజుల్లో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వైస్రాయ్ సంఘటన ఆయను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అన్న విషయం గురించి ఆయన కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు.
‘సాధారణంగా నాన్న ఎంత శాంతిపరులో.. అంతే ఆగ్రహంతో ఉంటారు. ఆయన మనసు కష్టమైన ఏ పని చేసిన తీవ్ర ఆగ్రహాం ప్రదర్శిస్తారు. వైస్రాయ్ ఘటన తర్వాత నాన్న ఎంతో ఆందోళన, ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో తనకు వెన్నుపోటు పొడిచిన వారిలో తన కుటుంబం కూడా ఉందని బాధపడ్డారు. ఆ సమయంలో నాన్నను కలిసి ఓదార్చేందుకు ఎవరూ ధైర్యం చేసి ఆయన వద్దకు వెళ్లలేకపోయారు. అలాంటి సమయంలో నాన్నను కలవాలని అనుకున్నాను. ఆయన నన్ను తిట్టినా.. కొట్టినా పర్వాలేదు ఖచ్చితంగా నాన్న ఇంటికి వెళ్లి కలవాలని పట్టుబట్టాను.
ఆ సమయంలో తమ్ముడు బాలకృష్ణ వారించాడు.. నాన్న ఎమైనా అంటే నువు తట్టుకోలేవు.. అవమానాన్ని భరించలేక ఏడుస్తావు అని అన్నాడు. మొత్తానికి బాలకృష్ణను ఒప్పించి నాన్న ఇంటికి వెళ్లాను. బాలయ్య బయట కూర్చొని ఉండగా.. నేను నాన్న ఆఫీస్ రూమ్ లోకి వెళ్లాను. అక్కడికి వెళ్లాగానే నన్ను చూసి రండి.. కూర్చొండమ్మా అంటూ ఒక ముసలివాడిని గద్దె దించడానికి కుటుంబం మొత్తం ఏకం కావాలా? అని ఆవేదనగా మాట్లాడారు. అదీ ఆయన గొప్పతనం.. నన్ను పల్లెత్తు మాట అనలేదు. నన్ను నాన్న కొట్టినా.. తిట్టినా బాధపడేదాన్ని కాదు.. ఆ రోజు నాన్న అన్న మాటలు ఇప్పటికి గుర్తుకు వస్తుంటాయి’ అని అన్నారు పురంధేశ్వరి.