తమిళ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం “జైభీమ్”. ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పోందింది. ‘అందురూ తప్పక చూడాల్సిన చిత్రం జైభీమ్’ అని రాజకీయ, సినీ ప్రముఖుల సైతం ప్రశంసిస్తున్నారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రానికి విజయంతో పాటు కొన్ని వివాదాలు కూడా తలుపుతట్టాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ‘వన్నియార్లు’ అనే వర్గాన్ని అవమానించేలా ఉన్నాయని ఆ సంఘ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ఆరోపించారు.
కాగా సూర్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై దక్షిణాది చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ స్పందిస్తూ.. సూర్య ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వన్నియార్ సంఘం తెలిపిన అభ్యంతరంపై సూర్య స్పందించి ఆ లోగోను తొలగించారని తెలిపారు. అలా చేసినా కూడా అన్బుమణి రామదాస్ తమకు సూర్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేయడం సరైన పద్దతి కాదన్నారు. సూర్యపై ఇలాంటి ఫిర్యాదులు రావడం విచారకరమని, రామదాస్ తమ డిమాండ్ ని వెనక్కితీసుకోవాలని కోరారు.
పేద ప్రజలు, గిరిజనులకు సూర్య ఎంతో సాయం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సూర్య సినీమాల విషయంలో రాజకీయాలు చేయవద్దన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది చంద్రు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ‘జైభీమ్’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు త.శె.జ్ఞానవేల్. చేయని తప్పునకు జైలుపాలై, ప్రాణాలు కోల్పోయిన తన భర్త పరిస్థితి మరొకరికి రాకూడదని ఓ మహిళ చేసిన న్యాయం పోరాటమే ఈ సినిమా కథాంశం.