ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెద్దయ్యాక తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు భాషతో సంబంధం లేకుండా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెద్దయ్యాక తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు భాషతో సంబంధం లేకుండా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తే.. అది తను తప్ప ఇంకెవరి వల్లా కాదు అనేంతగా ఆ పాత్రను రక్తి కట్టిస్తాడు. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు. సినిమా అంటే ప్యాషన్, పిచ్చి లాంటి మాటలు కంటే మించి ఇంకేవైనా ఉంటే చెప్పొచ్చు. రోల్ కోసం బాడీ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి, రిస్కీ స్టంట్స్ చెయ్యడానికి ఏమాత్రం వెనుకాడడు. ప్రయోగాలు చేస్తూ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, చేసే ప్రతి సినిమాకీ నటుడిగా మరింత ఎత్తుకు చేరుకుంటున్నాడు.
తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించిన ఘనత ఆయనది. ఇంతకీ ఆ వెర్సటైల్ యాక్టర్ ఎవరో కాదు. సూర్య. తండ్రి శివకుమార్‌లానే తను కూడా నటుడవ్వాలనుకున్నారు. 1975 జూలై 23న జన్మించిన సూర్య 2023 జూలైన తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ సూర్య రేర్ పిక్స్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. 1997లో దళపతి విజయ్‌తో కలిసి ‘నెరుక్కు నెర్’ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేశారు సూర్య. వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పితామగన్’ (శివపుత్రుడు) తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించింది. అక్కడినుండి డిఫరెంట్ స్టోరీస్, వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తూ విలక్షణ నటుడిగా మన్ననలు పొందాడు.
ఇక విశ్వనటుడు కమల్ హాసన్ కమ్‌బ్యాక్ ఫిలిం ‘విక్రమ్’ క్లైమాక్స్‌లో ‘రోలెక్స్’ గా వచ్చి రచ్చ చేసిన విషయం అంత త్వరగా మర్చిపోలేం. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌తో ‘వాడివాసల్’, శివ దర్శకత్వంలో ‘కంగువా’ చిత్రాలతో పాటు తను నటించగా తెలుగు, తమిళంలో మంచి ఆదరణ దక్కించుకున్న ‘సూరరైపోట్రు’ (ఆకాశం నీ హద్దురా) హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ పక్కన అతిథి పాత్రలో కనిపించనున్నారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘కంగువా’ టీజర్ రిలీజ్ చేయనున్నారు. 10 భాషల్లో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.