శివ శంకర్ మాస్టర్.. దక్షిణాది చలనచిత్ర రంగం గర్వించతగ్గ కొరియోగ్రాఫర్. సుమారు 40 సంవత్సరాల సినీ ప్రయాణంలో మాస్టర్ కొన్ని వేల పాటలకి డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరించారు. మూడు తరాల స్టార్ హీరోలకి డ్యాన్స్ లు కంపోజ్ చేసిన ఘనత కూడా శివ శంకర్ మాస్టర్ కే దక్కుతుంది. అయితే.., శివ శంకర్ మాస్టర్ ఏ పాటకైన డ్యాన్స్ కంపోజ్ చేయడానికి మూడు నుండి నాలుగు రోజుల సమయం తీసుకునేవారు. కానీ.., తెలుసా? మాస్టర్ ఓ రెండు పాటలకి మాత్రం చాలా సమయం తీసుకున్నారట. ఆ రెండు పాటలు ఆయా చిత్రాలకి ప్రధాన బలం అయ్యాయి. శివ శంకర్ మాస్టర్ కెరీర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచాయి.
మగధీరకి 22 రోజులు:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మగధీర మూవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. చరణ్ ని స్టార్ హీరోల సరసన కూర్చో బెట్టింది ఈ మూవీనే. ఈ సినిమాలో ధీర ధీర పాటకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ పాట కోసం రాజమౌళి మాస్టర్ ని సంప్రదించగా మొత్తం 22 రోజులపాటు షూట్ చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పారట. తరువాత మాస్టర్ అడిగినట్టే ఈ పాటని కొంత భాగం రాజస్థాన్‌లో తెరకెక్కించారు. ఆ పాట చూస్తే… చుట్టూ ఉప్పు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాంతంలో సుమారు వారం షూట్ చేశారట. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి 15 రోజులు షూటింగ్ చేశారట. ఈ పాట కోసం శివ శంకర్ మాస్టర్ ఇంత కష్టపడ్డారు కాబట్టే ఈ పాటకు గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది.
అరుంధతికి 32 రోజులు:
అరుంధతి.. తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ కూడా ఈ చిత్రాన్ని మరచిపోలేరు. ఇందులో జేజమ్మగా అనుష్క నటన అద్భుతమనే చెప్పుకోవాలి. కానీ.. ఈ సినిమాలో వచ్చే.. భు భు భుజంగం.. ది ది తరంగం… సాంగ్ కథలో చాలా కీలకమైంది. ఈ పాట కోసం శివ శంకర్ మాస్టర్ మొత్తం 32 రోజులు సమయం తీసుకున్నారు. పశుపతిని అంతం చేయడానికి జేజేమ్మగా అనుష్క చేసే డ్యాన్స్ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఇలా.. అరుంధతి సక్సెస్ కి కూడా శివ శంకర్ మాస్టర్ ప్రధాన కారణమయ్యారు. ఇలా చివరి వరకే కళ కోసం ఇంత కృషి చేసిన మాస్టర్ కి ప్రేక్షకుల సెల్యూట్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.