పెళ్లంటే నూరేళ్ల పంట.. బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యే నవ వధూవరులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని వివాహబంధంలోకి అడుగు పెడతారు. ప్రముఖ సింగర్ పెళ్లైన కొద్ది గంటల్లోనే కన్నుమూయడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. అప్పటి వరకు అందరితో ఎంతో సంతోషంగా గడిపిన ఆ సింగర్ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. బంధుమిత్రులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్, రచయిత జెక్ ఫ్లింట్ కన్నుమూశారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. ఈ విషయాన్ని జెక్ ఫ్లింట్ మేనేజర్ ధృవీకరించారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన బ్రెండా విల్సన్ ని ఎంతగానో ప్రేమించాడు. ఈ క్రమంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం జెక్ ఫ్లింట్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. మరుసటి రోజు రాత్రి నిద్రలోనే జెక్ ఫ్లింట్ మరణించారు. అయితే జెక్ ఫ్లింట్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
భర్త మృతిపై బ్రెండా విల్సన్ కన్నీరు మున్నీరవుతుంది.. తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంలూ కన్నీళ్లు తెప్పించే విధంగా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ‘ఎవరికీ ఈ కష్టం రాకూడదు.. నా ఆనందం.. సంతోషం నా భర్తతో వెళ్లిపోయాయి.. ఆయన మళ్లీ తిరిగిరావాలి.. ఈ సమయంలో నా భర్తతో నేను పెళ్లి ఫోటోలు చూసుకోవాలి.. కానీ ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాల్సిన దుస్థితి ఏర్పడింది.. నా భర్త లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న జెక్ ఫ్లింట్ పెళ్లైన కొన్ని గంటలకే కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది.