B Praak: బిడ్డకు జన్మనివ్వడం, పుట్టిన బిడ్డను అలా ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకోవడం అనేవి అందరి దంపతుల కల. ఒకవేళ ఆ కల నెరవేరే సమయానికి ఏదైనా విషాదం చోటుచేసుకుంటే మాత్రం.. ఆ తల్లిదండ్రులు కావాల్సిన దంపతుల ఇంట తీరని శోకమే మిగులుతుంది. తాజాగా ప్రముఖ సింగర్ బిప్రాక్ ఇంట విషాదం నెలకొంది. కాసేపట్లో తల్లిదండ్రులు కాబోతున్నామని ఎంతో ఆశగా ఎదురుచూసిన సింగర్ దంపతులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
పది నెలల క్రితమే సింగర్ బిప్రాక్, తన భార్య మీరా గర్భవతి అయినట్లు, త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఎంతో ఆనందంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీరా బిడ్డకు జన్మనిచ్చే సమయం ఆసన్నమై.. గురువారం మీరా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. అప్పుడే పుట్టిన బిడ్డ మరుక్షణమే పోత్తిళ్లలోనే కన్నుమూసి బిప్రాక్ కి, తన భార్య మీరాకు తీరని శోకాన్ని మిగిల్చింది.
ప్రస్తుతం బిప్రాక్ దంపతులను కలచివేస్తున్న ఈ ఘటనతో.. బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు పులుముకున్నాయి. ఈ బాధాకరమైన విషయాన్ని సింగర్ బిప్రాక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాకు బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఆ బిడ్డ మమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయింది. పుట్టిన సమయంలోనే మా బిడ్డ చనిపోయింది. తల్లిదండ్రులుగా మాకిది భరించలేని విషయం. మా బిడ్డను కాపాడేందుకు ఎంతో కృషిచేసిన వైద్యులకు కృతజ్ఞతలు. ఇలాంటి పరిస్థితిలో మాకు సపోర్ట్ చేస్తున్నవారికి, అభిమానులకు ధన్యవాదాలు. ప్రస్తుతం మేం ప్రైవసీని కోరుకుంటున్నాం అర్థం చేసుకోగలరు’ అంటూ బిప్రాక్ రాసుకొచ్చాడు.
ఇక ఈ విషయం తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిప్రాక్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సూర్యుడివో చంద్రుడివో అనే పాట పాడి బెస్ట్ సింగర్ గా అవార్డు అందుకున్నాడు. అయితే.. అంతకుముందే దేశవ్యాప్తంగా బిప్రాక్ చాలా ఫేమస్. కొన్నేళ్ల కిందటే తాను ప్రేమించిన మీరాను వివాహమాడి ఇటీవలే తాము పేరెంట్స్ కాబోతున్నామని తెలిపాడు. ప్రస్తుతం బిప్రాక్ దంపతుకు అభిమానులు, సెలబ్రిటీలు సపోర్ట్ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.